
హైదరాబాద్, వెలుగు : జీవో 58, 59 కింద ఆక్రమిత భూముల రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తుల ప్రక్రియ బుధవారం ముగిసింది. దాదాపు 1.25 లక్షల అప్లికేషన్లు ఈ రెండు జీవోల కింద క్రమబద్దీకరణకు వచ్చినట్లు తెలిసింది. జూన్ లోనే అప్లికేషన్ల పరిశీలన మొదలుపెట్టనున్నారు. ఆ తరువాత అర్హులకు పట్టాలు అందజేస్తారు. వాస్తవానికి ఏప్రిల్ లోనే ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆ తరువాత ఇంకో నెల వరకు గడువు పెంచింది. బీఆర్ఎస్ లీడర్ల ఒత్తిడి మేరకు ప్రభుత్వం గడువును మరింత పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ రెండు నెలల్లో వచ్చిన అప్లికేషన్లలోనూ మెజారిటీ అధికార పార్టీకి చెందిన లీడర్లు, కార్యకర్తలవే ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. కొందరు ఈ రెండు నెలల్లోనే కబ్జాలు చేసి పాత తేదీల్లో తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించి అప్లై చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు జీవోల కింద అప్పట్లో 2014 జూన్2 వరకు ఉన్న కబ్జాలకే ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్నది. ఇటీవల దానిని 2020కు పెంచింది. రెండుసార్లు అనుమతి ఇవ్వడంతో జీవో 58, 59 కింద 3.96 లక్షల అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ లక్ష పైన వచ్చాయి.
58 జీవో కింద 125 గజాలలోపు స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఇండ్లను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తారు. 250 గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50 శాతం, 250 నుంచి 500 గజాల స్థలాలకు కనీస ధరలో 75 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి. 500 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు అప్పటి మార్కెట్ ధరకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేసుకోవాలి. నివాసేతర వినియోగ భూములకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వ నిర్ణయించిన కనీస ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.
రెగ్యులరైజేషన్‌పై ఆర్డీవో చైర్మన్‌గా, సంబంధిత తహసీల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. తహసీల్దార్లు సదరు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీదే కన్వేయన్స్ డీడ్‌ను చేసి ఇవ్వాల్సి ఉంటుంది.