ఎస్​బీఐ లైఫ్​చేతికి సహారా పాలసీలు

ఎస్​బీఐ లైఫ్​చేతికి సహారా పాలసీలు

న్యూఢిల్లీ: సహారా ఇండియా లైఫ్​ ఇన్సూరెన్స్​ కంపెనీకి చెందిన రెండు లక్షల పాలసీలతో పాటు పాలసీహోల్డర్ల ఆస్తులనూ స్వాధీనం చేసుకోవాలని ఇన్సూరెన్స్​ రెగ్యులేటర్​ ఐఆర్​డీఏ ఎస్​బీఐ లైఫ్​ను ఆదేశించింది. సహారా ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీని ఫైనాన్షియల్స్​ పటిష్టంగా ఉన్నందున సహారా పాలసీలను ఎస్​బీఐ లైఫ్​కు అప్పగించింది. ఈ ఆదేశాలను గడువులోపు అమలయ్యేలా చూసేందుకు ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించింది.

సహారా పాలసీ హోల్డర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా సెల్​ను ఏర్పాటు చేయాలని ఎస్​బీఐ లైఫ్​కు సూచించింది. లైఫ్​ఇన్సూరెన్స్​ బిజినెస్​ కోసం సహారాకు 2004లో లైసెన్స్​ మంజూరయింది. ఈ కంపెనీ ఆర్థికంగా బలహీనపడటం, పాలనాపరమైన లోపాలు ఉండటంతో వ్యాపారాన్ని నడిపించడానికి ఐఆర్​డీఏ 2017లో ప్రత్యేకంగా అడ్మినిస్ట్రేటర్​ను నియమించింది. కొత్త పాలసీలు ఇవ్వకుండా సహారాపై నిషేధం విధించింది. చట్టపరంగా నడచుకునేందుకు అనేకసార్లు గడువు ఇచ్చినా సహారా విఫలమైంది.