
- నష్టపరిహారం అందక తల్లడిల్లుతున్న రైతులు
- లోయర్జెన్కో ప్లాంట్ కట్టడం వల్లే పెరుగుతున్న ముంపు
- త్వరలో రైతులకు పరిహారం అందజేస్తామన్న అధికారులు
గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడల్లా పంట పొలాలు మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పొలాలు ముంపునకు గురవుతున్నా పరిహారం రాకపోవడంతో అన్నదాతలు తల్లడిల్లుతున్నారు. లోయర్ జెన్కో ప్లాంట్ కట్టడం వల్ల గద్వాల మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన రైతుల పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి.
గతంలో పంటనష్టపోయిన రైతులకు రూ.6 కోట్ల పరిహారం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం రూ.4.32 కోట్లు మాత్రమే చెల్లించారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 3,20,000 క్యూసెక్కుల నీరు వరద వస్తుండడంతో రేకులపల్లి గ్రామానికి చెందిన 40 ఎకరాలకు పైగా పంట పొలాలు మునిగిపోయాయి.
లోయర్ జెన్ కో వల్ల ముంపు..
గద్వాల మండలం రేకులపల్లి దగ్గర కృష్ణానదిపై జెన్కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్ ఏర్పాటు చేశారు. కృష్ణానదికి అడ్డంగా ప్లాంట్ ను నిర్మించడంతో వరద ఎక్కువగా వచ్చినప్పుడు పంట పొలాలు మునిగిపోతున్నాయి. మొదట 299 మీటర్ల లెవల్ వరకు పొలాలు మునుగుతాయని అధికారులు అంచనా వేసి గతంలో పరిహారం అందించారు. ఆ తర్వాత దాదాపు 150 ఎకరాల్లో పంట పొలాలు మునగడంతో రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
దీంతో మళ్లీ జెన్కో ఆఫీసర్లు 301 మీటర్ల వరకు ముంపునకు గురవుతున్న వాటికి కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు పర్యటించి 226 నుంచి 270 సర్వే నంబర్ల వరకు సర్వే చేసి 150 ఎకరాలు ముంపునకు గురవుతాయని రిపోర్ట్ ఇచ్చారు. 150 ఎకరాలకు సంబంధించిన 120 మంది రైతులకు రూ.6 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు.
కొందరికి మాత్రమే పరిహారం..
150 ఎకరాలు ముంపునకు గురవుతాయని అధికారులు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ పరిహారం మాత్రం కొందరికే ఇచ్చారు. ప్రస్తుతం రూ.6 కోట్ల నష్టపరిహారం ఇవ్వాల్సి ఉండగా, రూ.4.32 కోట్లు మాత్రమే చెల్లించారు. అందరికీ పరిహారం అందకపోవడంతో ముంపునకు గురవుతున్న పొలాల్లో మళ్లీ పంట సాగు చేశారు. ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగానే తమకు నష్టం వస్తుందని, గతంలోనే పరిహారం ఇచ్చి ఉంటే తాము పంట సాగు చేసే వారం కాదని బాధిత రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసిన పంట పొలాలకు నష్టపరిహారంతోపాటు భూమికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో నష్టపరిహారం చెల్లిస్తాం..
రైతులకు పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం. జన్ కో నుంచి నష్టపరిహారం డబ్బులు వచ్చాయి. త్వరలో రైతుల జాబితాను రెడీ చేసి పరిహారం చెల్లిస్తాం. - శ్రీధర్, తహసీల్దార్, గద్వాల్