మావోళ్లు ఎట్లున్నరో ఏమో.. కరోనా పేషెంట్ల బంధువుల ఆవేదన

మావోళ్లు ఎట్లున్నరో ఏమో.. కరోనా పేషెంట్ల బంధువుల ఆవేదన


హైదరాబాద్, వెలుగు: అయినోళ్లు కరోనా వచ్చి గాంధీ ఆసుపత్రిల జేరితే బయటున్న వారి బంధువులు తమవారికి ఏమైతోదననే భయంతో ఉన్నరు. కరోనాతో బెడ్ మీద ఉన్న రోగి ఎట్లున్నడో.. తింటున్నడో లేదో మాట ముచ్చటైనా ఉందా లేదా? ఈవేమీ దవాఖాన బయట పడిగాపులు కాస్తున్నోళ్లకు తెలుస్తలేవు. ఎట్లున్నరో అని తలుసుకుని మరీ ఏడుస్తున్నరు. ఒక్కసారి సూసొస్తామన్నా ఎవరూ లోపలికి పంపుతలేరని కండ్లనిండా నీళ్లు నింపుకుని చెప్తున్నరు. ఓ తల్లి, ఓ భార్య, ఓ చెల్లి, ఓ అన్న ఇట్ల ఎందరో.. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, యూపీ  నుంచి, మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని పల్లెల నుంచి వచ్చినోళ్లను ఇక్కడ పట్టించుకునే నాథుడే లేడు. వారం, పది రోజులు రోడ్ల పక్కనే పడుకుని తమవాళ్లు కోలుకుని రావాలని దేవుణ్ని వేడుకుంటున్నరు. 

మెట్రో స్టేషన్, ఫుట్​పాత్​లే ఆవాసాలు..

గాంధీ హాస్పిటల్ ముందున్న మెట్రో స్టేషన్ పిల్లర్లు, ఆ మెట్లు, బస్టాప్​లు, ఫుట్​పాత్​లు ఇప్పుడు వందల మందికి ఆవాసాలైనయ్. కరోనా సోకి ఆసుపత్రిల ట్రీట్​మెంట్​తీసుకుంటున్న రోగుల బంధువులకు నీడైయినయ్. వారం, పది రోజుల నుంచి కొన్ని వందల మంది అక్కడక్కడే తిరుగుతూ, అక్కడే తిని, అక్కడే పడుకుంటున్నరు. చిన్న చిన్న పిల్లల నుంచి ముసలోళ్ల వరకు టెంట్లేసుకుని, చెట్ల కింద ఉంటున్నరు. లోపలికి పోదామంటే పోలీసులు గేటు దగ్గరే ఆపేస్తున్నరు. ‘చాలామంది పేషెంట్లను క్రిటికల్ కండిషన్ లో ఇక్కడ చేర్పించారు. ఆక్సిజన్ లేకుంటే అర సెకండ్ కూడా ఉండలేని పరిస్థితి చాలామంది రోగులది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందైతుందని ఇక్కడికి తీసుకొచ్చాం అని సగం మంది రోగుల బంధవులు చెబుతున్నారు. కానీ లోపల పరిస్థితి ఎలా ఉందో తెలియదంటున్నారు. లోపల ఆక్సిజన్ లేదని అంటున్నరు. రోగులను ఫ్లోర్ల మీదనే పడేస్తున్నరు. కనీసం పట్టించుకుంటలేరు’ అని ఓ పేషెంట్ బంధువు ఆవేదనతో చెబుతున్నాడు. హాస్పిటల్​లో చేర్పించిన రోజే  మా వోళ్లను చూసినమని ఆ తర్వాత చూసేందుకు సిబ్బంది ఒప్పుకుంటలేరని మరికొందరు పేషెంట్ల బంధువులు చెప్తున్నరు.

ఒక్కదాన్నే ఉంటున్న

మాది ఇల్లందు. నా బిడ్డను తీసుకొచ్చినం. 18 ఏండ్లు ఉంటయి. కిడ్నీలో ప్రాబ్లమని తీసుకొస్తే, వచ్చాక కరోనా అని చెప్పిళ్లు. ఇక్కడికి వచ్చి వారమైతుంది. నా కొడుకులు అడ్మిట్ చేసి పోయిన్రు. లోపల నా బిడ్డ దగ్గర ఎవరూ లేరు. నేను ఇక్కడ బయట కూసుని ఉన్నా. ఒక్కగానొక్క బిడ్డ. లోపల ఒక్కతే ఎట్లున్నదో. తింటున్నదో లేదోనని భయమైతాంది. కొడుకులు ఇక్కడికి వస్తే వాళ్లకి కరోనా వస్తదని భయపడుతున్నరు. నా బిడ్డ పాణం మంచిగ కావాలని నేను ఎక్కడికి పోకుండా ఇక్కడనే ఉన్న. మస్తు గుబులైతుంది. 
- సత్యవతి, పేషెంట్ తల్లి, ఇల్లందు

మా అమ్మని తీసుకొచ్చినం

మా అమ్మ వయసు 65 ఏండ్లు. బాగా ఆయాసం రావడంతో మాకు భయమై ఇక్కడికి తీసుకొచ్చినం. మా అమ్మ, నేను, మా మరిది వచ్చినం. ఇదివరకు ఎప్పుడూ ఇటువైపు రాలేదు. అంబులెన్స్ ల నుంచి దిగి ఇక్కడే కూసున్న. లోపలికి తీసుకుపోయి ఆక్సిజన్ పెట్టినం అని చెప్పిర్రు. లోపల ఒక్కత్తే ఎట్ల ఉన్నదో అని నాకు కాళ్లు, చేతులు ఆడతలేవు. చెట్టు కింద పొద్దున్న కాన్నుంచి ఒక్కదాన్నే కూసున్న. లోపలి నుంచి ఎవరు ఫోన్ చేస్తరో అని చూసుకుంటూ ఉన్న. 
- అనూష, పేషెంట్ కూతురు, జహీరాబాద్ 

పట్టించుకుంటలేరు

బాగుంటే ఎందుకు తీసుకొస్తం. ఆక్సిజన్ లేక మూడు సార్లు కిందపడ్డడు. ఎత్తుకుని ఆంబులెన్స్ లో పడుకోబెట్టినం. గాంధీల జేర్పించిన తర్వాత కూడా బాత్రూమ్ లో పడిపోయిండు. అయినా ఎవ్వరు పట్టించుకుంటలేరు. మేమే ఎత్తుకుని బెడ్ల పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టినం. రాత్రి రెండు సూదులిచ్చిర్రు. ఆక్సిజన్ లేకుంటే ఉంటలేడు. ఇద్దరు కూతుర్లున్నరు. మా అన్న జేస్తనే ఇల్లు గడిచేది. ఏమైతదో తెలుస్తలేదు. మా వదినా రాత్రంతా ఏడుస్తనే ఉంది. 
- లక్ష్మి, పేషెంట్ చెల్లి, జగద్గిరిగుట్ట

‘కట్టెలెక్కుండే మనిషి. ఏ రోగం నొప్పి లేదు. ఒకల్ల మీద ఆధారపడకుండా మాది మేం బతుకుతున్నం. కుండలు చేసుకుంట బతుకుడే మాకు తెలుసు. కానీ కరోనా మా బతుకులను ఆగంజేసింది. ఉన్నట్టుండి మనిషి బేజారైండు. ఛాతీలో నొప్పైతాంది అనుడు మొదలుపెట్టిండు. ఏం తినుడులేదు. తాగుడు లేదు. మనిషంతా కరాబైండు. మాది చేగుంట. అక్కడ హాస్పిటళ్ల బెడ్లు లేవంటే గాంధీ ఆస్పత్రికి తోలుకొచ్చినం. వచ్చి మూడు రోజులైతుంది. మనిషి ఎట్లున్నడో ఏమో అర్థమైతలేదు. అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడు లేవయ్యా లేవయ్యా అని మస్త్ ఏడ్చిన. కళ్లు తెరవమని కొడుకులు మొత్తుకున్నరు. అసలు సోయిలనే లేడు. నాకు కాళ్లు చేతులు ఆడుతలేవు. లోపలికి పంపుళ్లని మొత్తుకుంటున్నా గాంధీ సెక్యూరిటీ గేటు కాడి నుంచే వెళ్లగొడుతున్నరు. లోపల తింటున్నడో, ఎట్ల చూసుకుంటున్నరో తెల్వది. భయంభయంగా ఉంది. మస్త్ గుబులైతాంది." అని కన్నీటితో తన బాధను చెప్పుకుందో పెద్దవ్వ.

"మాది జగద్గిరి గుట్ట. మా అన్నకి వారం కింద కరోనా వచ్చింది. ఈఎస్ఐ ల బీపీ, షుగర్ టెస్ట్ జేసిళ్లు. నీకేం లేదు బాబు.. బాగుంది పో అన్నరు. మొన్న పొద్దుగాల అన్నం తిన్న కొద్దిసేపటికే ఊపిరాడకుండా పోయింది. మళ్ల ఈఎస్ఐకి తీసుకుపోయినం. ఇంత సీరియస్ అయ్యేదాక ఏం జేసిళ్లు అని అక్కడి డాక్టర్లు మమ్ముల్నే తిట్టిన్రు. ఆక్సిజన్ పెట్టమని అడిగినం. మా దగ్గర లేదు గాంధీకి పట్టుకుని పోర్రి అన్నరు. రూ.2 వేలకు అంబులెన్స్ మాట్లాడుకుని ఆక్సిజన్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చినం. ఇక్కడ ఆక్సిజన్ పెట్టమంటే పెడతలేరు. అంబులెన్స్ లో నుంచి ఆక్సిజన్ తీయంగనే మా అన్న కింద పడిపోయిండు. భయపడి ఆక్సిజన్ తీయలేదు. వీళ్లను పెట్టమంటే ఆక్సిజన్ లేదన్నరు. సీరియస్ ఉన్నోళ్లకు ఎందుకు పెడతలేరని గొడవ జేస్తే అప్పుడు తెచ్చి పెట్టిళ్లు. ఆ తర్వాత ఆక్సిజన్ తీసేసిన్రు. మేం ఏడ్చి మొత్తుకుంటే పెట్టిండ్రు. రెండు సెకండ్లు కూడా ఆక్సిజన్ లేకుండా ఉంటలేడు. ఆక్సిజన్​తీయకుల్లి అని అందరి కాళ్లు మొక్కినం. అయినా వింటలేరు. పేషెంట్ బాగున్నడు ఇంటికి తీసుకుపోండి అంటున్నరు. అన్ననేమో పడిపోతున్నడు. మాకు నమ్మకం వస్తలేదు. భయమైతుంది. " 
– ఓ చెల్లెలి ఆవేదన.