- తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల (ఎస్ఆర్) స్టైపెండ్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వ హాస్పిటల్స్లో రాత్రీ పగలు తేడా లేకుండా సేవలు అందిస్తున్నా.. గత రెండు నెలలుగా వీరికి నయా పైసా అందడం లేదు. దీంతో 2022 పీజీ బ్యాచ్ కు చెందిన డాక్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పెండింగ్ లో ఉన్న తమ స్టైపెండ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ డి.శ్రీనాథ్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సి.కరిష్ని శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించకపోతే.. తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ (టీజేయూడీఏ)తో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీ-ఎస్ఆర్డీఏ హెచ్చరించింది. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
పోర్టల్ తిప్పలు.. ఆగిపోయిన జీతాలు
విధుల్లో చేరి రెండు నెలలవుతున్నా జీతాలు ఇవ్వకుండా అధికారులు సాంకేతిక కారణాలు చూపుతున్నారని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ పూర్తి చేసుకున్న 2022 బ్యాచ్ డాక్టర్లు ప్రస్తుతం సీనియర్ రెసిడెంట్లుగా సేవలు అందిస్తున్నారు. అయితే, పీజీ పోర్టల్ లో వీరి పాత బకాయిలు ఇంకా పెండింగ్ లోనే చూపిస్తున్నాయి. అవి క్లియర్ చేస్తేనే.. వీరి పేర్లు ఆటోమేటిక్‌గా ఎస్ఆర్ స్టైపెండ్ పోర్టల్ లోకి మారుతాయి.
ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో.. పోర్టల్ అప్డేట్ కాక, కొత్త జీతాలు (స్టైపెండ్) రాక డాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పాత బకాయిలు మొత్తం క్లియర్ చేసి, 2022 పీజీ బ్యాచ్ ఎస్ఆర్ ల స్టైపెండ్ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేసింది. భవిష్యత్తులోనూ జీతాలు క్రమం తప్పకుండా చెల్లించాలని కోరింది.
