పదేండ్లకుపైగా శిక్ష పూర్తైన ఖైదీలను విడుదల చేయండి.. సీఎంకు మానవ హక్కుల వేదిక విజ్ఞప్తి

పదేండ్లకుపైగా శిక్ష పూర్తైన ఖైదీలను విడుదల చేయండి.. సీఎంకు మానవ హక్కుల వేదిక విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: పదేండ్లకుపైగా జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను విడుదల చేయాలని సీఎం రేవంత్‌‌రెడ్డిని రాష్ట్ర మానవ హక్కుల వేదిక ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం మారినప్పుడు ఖైదీలను విడుదల చేసే సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎం స్పెషల్ సెక్రటరీ శశిధర్‌‌‌‌ను మానవ హక్కుల ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు.  వైఎస్‌‌ఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవో 189 ప్రకారం ఖైదీలను విడుదల చేశారని గుర్తుచేశారు.

ఇప్పుడు కూడా అదే విధానం అమలు చేయాలన్నారు.  జీవిత ఖైదు శిక్ష పడిన 276 మంది నేరస్తులు  రాష్ట్రంలోని 14 జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పారు.  ఇందులో 52 మంది పదేండ్ల శిక్షను, 9 మంది 25 ఏండ్ల  శిక్షను పూర్తి చేసుకున్నారని తెలిపారు. వీరితో పాటు చిన్న చిన్న నేరాలతో  జైలు పాలై, సగం శిక్షకాలం పూర్తయిన  వారిని రిలీజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుపతయ్య పాల్గొన్నారు.