రూ.35 వేల కోట్ల అప్పులు తీర్చేశాం: అనిల్ అంబానీ

రూ.35 వేల కోట్ల అప్పులు తీర్చేశాం: అనిల్ అంబానీ
  • మిగతావీ త్వరలో చెల్లిస్తాం
  • రిలయన్స్‌‌ గ్రూప్‌‌ ప్రకటన

ముంబై: లెండర్లకు గత 14 నెలల్లో రూ.35,400 కోట్ల బకాయిలు చెల్లించామని అనిల్‌‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌‌ గ్రూప్‌‌ ప్రకటించింది. ఈ సంస్థకు దాదాపు రూ.లక్ష కోట్ల వరకు అప్పులు ఉన్నాయి. బకాయిలు తీర్చడానికి ఆస్తులు అమ్మేశామని, ఎవరి మద్దతూ తీసుకోలేదని ఈ గ్రూప్‌‌ తెలిపింది. మరిన్ని ఆస్తులు అమ్మి మిగతా అప్పులు తీర్చేస్తామని రిలయన్స్‌‌ చైర్మన్‌‌ అనిల్ అంబానీ ప్రకటించారు.

ఈ గ్రూపులోని ఏడు లిస్టెడ్‌‌ కంపెనీల షేర్ల విలువ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 65 శాతం పడిపోయిన నేపథ్యంలో ఆయన ఈ విషయం చెప్పారు. ప్రస్తుతం చెల్లించిన మొత్తంలో రూ.24,800 కోట్లు అసలు కాగా, రూ.10,600 కోట్లు వడ్డీలు. రిలయన్స్‌‌ క్యాపిటల్‌‌, రిలయన్స్‌‌ పవర్‌‌, ఆర్‌‌ఇన్‌‌ఫ్రా, వీటి అనుబంధ సంస్థలు గత ఏప్రిల్‌‌ నుంచి ఈ ఏడాది మే వరకు చెల్లించాల్సిన బకాయిలు ఇవి. ప్రభుత్వం విధించిన షరతుల కారణంగా తన అన్న ముకేశ్‌‌ అంబానీ సంస్థ జియోకు రూ.23 వేల కోట్ల విలువైన స్పెక్ట్రాన్ని అమ్మలేకపోయారు. అయితే ఎరిక్సన్‌‌కు చెల్లించాల్సిన రూ.485 కోట్లను ముకేశ్‌‌ అనిల్‌‌కు సర్దుబాటు చేశారు. ఈ డబ్బు చెల్లించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అనిల్‌‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే. అప్పులు తీర్చడానికి ఆర్‌‌పవర్‌‌ డ్రిస్ట్రిబ్యూషన్‌‌ వ్యాపారాన్ని అదానీ గ్రూపునకు రూ.18 వేల కోట్లకు అమ్మేశారు. మ్యూచువల్‌‌ ఫండ్‌‌ వ్యాపారంలోని రూ.ఆరు వేల కోట్ల విలువైన వాటాను జాయింట్‌‌ వెంచర్‌‌ పార్ట్‌‌నర్‌‌ జపాన్‌‌కు చెందిన నిప్పన్‌‌ గ్రూపునకు అప్పగించారు. బీమా వ్యాపారాన్ని కూడా అమ్మేయడానికి అనిల్ గ్రూపు ప్రయత్నిస్తున్నది. బిగ్‌‌ ఎఫ్‌‌ఎంలో రూ.1200 కోట్ల విలువైన వాటాను జాగరణ్‌‌ గ్రూపునకు కట్టబెట్టారు. అయితే రిలయన్స్‌‌ టెలికం విభాగం ఆర్‌‌కామ్‌‌ ఒక్కటే వివిధ కంపెనీలకు రూ.49 వేల కోట్లు బాకీ పడింది. దీంతో ఆర్‌‌కామ్‌‌ ఎన్సీఎల్టీకి వెళ్లింది.