న్యూఢిల్లీ: బొమ్మల తయారీ కోసం రిలయన్స్ రిటైల్ హర్యానాకు చెందిన ‘సర్కిల్ఈ రిటైల్’ సంస్థతో జాయింట్ వెంచర్‌లోకి ప్రవేశించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స్థానికంగా ఆట వస్తువుల తయారీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రిలయన్స్‌కు ఇది వరకే బ్రిటిష్ బొమ్మల బ్రాండ్ హామ్లీస్, స్వదేశీ బొమ్మల బ్రాండ్ రోవాన్లు ఉన్నాయి. జేవీ ఏర్పాటు నిజమేనని రిలయన్స్ రిటైల్ సీఎఫ్ఓ దినేష్ తలూజా తెలిపారు. దశలవారీగా థర్డ్- పార్టీ తయారీదారులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో రిలయన్స్‌కి ఈ జేవీ సహాయపడుతుంది. ఈ కొత్త వెంచర్ రిలయన్స్ రిటైల్ యాజమాన్యంలోని హామ్లీస్, రోవాన్ బ్రాండ్ల బొమ్మలను కూడా అందిస్తుంది. సర్కిల్ ఈ రిటైల్‌కు బొమ్మల తయారీలో ప్రత్యేకత ఉంది. దీనికి హర్యానాలో ఆధునిక తయారీ యూనిట్ ఉంది. అనేక రకాల బొమ్మలను తయారు చేయడానికి, పంపిణీ చేయడానికి లైసెన్స్ ఉంది.
గత సంవత్సరం, రిలయన్స్ రిటైల్ తన బ్రాండ్ రోవాన్‌ను బీ2బీ హోల్‌సేల్ నుంచి సాధారణ రిటైల్ మార్కెట్‌కు కూడా విస్తరించింది. చిన్న షాపులతో బ్రాండెడ్ బొమ్మల మార్కెట్లో వాటాను పెంచుకోవడంపై రిలయన్స్ దృష్టి సారించింది. రిలయన్స్ రిటైల్ 2019లో బొమ్మల రిటైలర్ అయిన హామ్లీస్‌ను కొనుగోలు చేసింది. హామ్లీస్ ప్రస్తుతం 15కిపైగా దేశాలలో దుకాణాలను నడుపుతోంది. ఒక రిపోర్ట్ ప్రకారం, భారతీయ బొమ్మల మార్కెట్ విలువను 2019–-20 సంవత్సరంలో బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 2024–-25 నాటికి ఇది 2 బిలియన్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు.
