
- ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని సర్కారుకు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా.. ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌పై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల ప్రణాళిక, నిర్మాణం, పర్యవేక్షణలో లోపాలపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన తుది నివేదికలోని సిఫార్సుల ఆధారంగా తనపై చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ సభర్వాల్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై చీఫ్ జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం విచారించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫు సీనియర్ అడ్వకేట్ జె.రామచందర్ రావు వాదిస్తూ.. పిటిషనర్‌ను సాక్షిగానే కమిషన్ పిలిచిందని.. ఆ తరువాత 8బి, 8సి నోటీసులు ఇవ్వకుండానే తుది నివేదికలో ఆరోపణలు చేసిందన్నారు.
కమిషన్ ఏకపక్షంగా అభియోగాలు చేసిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది ప్రతివాదన చేస్తూ.. పిటిషనర్ ప్రాజెక్టులను సందర్శించారని, సీఎంకు నివేదికలు ఇచ్చారని చెప్పారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఉన్న అంశాల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కమిషన్ నివేదికను సవాలు చేస్తూ గతంలో కేసీఆర్, హరీశ్ రావు, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి జోషి దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి అక్టోబర్ 7వ తేదీన విచారణ చేపపడతామని వెల్లడించింది. కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ఉండబోదని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. సీబీఐకి కూడా కమిషన్ నివేదిక కాపీతో సంబంధం లేకుండా సొంతంగా దర్యాప్తు చేస్తుందని తెలిపింది.