సాత్విక్ను మానసికంగా, శారీరకంగా వేధించిన శ్రీ చైతన్య కాలేజీ

సాత్విక్ను మానసికంగా, శారీరకంగా వేధించిన శ్రీ చైతన్య కాలేజీ

హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్యం కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న  విద్యార్థి సాత్విక్‌ సూసైడ్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పోలీసుల రిమాండ్ రిపోర్టులో సాత్విక్ను  మానసిక వేధింపులకు గురి చేసినట్లు వెల్లడైంది.  A1గా ఉన్న అడ్మిన్‌ ప్రిన్సిపాల్ అకలంకం నర్సింహాచారి సాత్విక్‌ ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా దూషించారని తెలుస్తోంది.  వాచ్‌మెన్‌గా కూడా పనికిరావంటూ ప్రిన్సిపాల్ హేళన చేశారని రిమాండ్ రిపోర్టు పేర్కొంది. 

రిమాండ్ రిపోర్టులో ఏముంది..?

ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ను ప్రిన్సిపాల్ శివరామకృష్ణారెడ్డి, వార్డెన్ నరేష్, వైస్ ప్రిన్సిపాల్ జగన్ శారీరక, మానసిక హింసలకు గురిచేశారు. అంతేకాకుండా కులం పేరుతో దూషించారు. వైస్ ప్రిన్సిపాల్ జగన్, సాత్విక్కు మార్కులు తక్కువగా వస్తే  ఐదారు గంటలు బయట నిలబెట్టేవాడు. సాత్విక్ స్నానం చేస్తుంటే వార్డెన్ నరేష్ టాప్ బంద్ చేసేవాడు. సాత్విక్ నీళ్లు తాగుతుంటే బాటిల్ లాక్కునేవాడు. అయితే సాత్విక్ కాలేజీలో  చేరినప్పటి నుంచి నీటి సమస్య ఉందంటూ ఫిర్యాదులు చేస్తున్నాడు. దీంతో వార్డెన్ నరేష్ టార్గెట్ చేశాడని.. మిగతా సిబ్బందిని కూడా అతడిపై ఉసిగొల్పాడని పోలీసులు  రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

సోదరుడికి చెప్పిన సాత్విక్..

కాలేజీలో తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తన సోదరుడికి సాత్విక్ చెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వారి వేధింపులు ఆగలేదు. అటు సాత్విక్ తన సూసైడ్ నోట్‌లో తన మరణానికి కాలేజీ అడ్మిన్ ప్రిన్సిపల్ అకలంకం నర్సింహాచారి, ప్రిన్సిపల్ తియ్యగురు శివరామకృష్ణారెడ్డి, హాస్టల్ వార్డెన్ కందరబోయిన నరేశ్, వైస్ ప్రిన్సిపల్ ఒంటెల శోభాబు కారణమని పేర్కొన్నాడు.  వీరంతా తనను మానసికంగా వేధించారని చెప్పాడు. తీవ్రంగాకొట్టి చిత్రహింసలకు గురిచేసేవారని వివరించాడు.  ఈ నేపథ్యంలో పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ నలుగురిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. జడ్జీ ఆదేశాల మేరకు  చర్లపల్లి జైలుకు తరలించారు.

బలవన్మరణం..

నార్సింగిలోని శ్రీచైతన్య కాలేజీలో సాత్విక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ యాజామన్యం వేధింపులకు గురిచేయడంతో...తీవ్ర మనస్తాపానికి గురైన సాత్విక్.... మార్చి 1న కాలేజీలోని తరగతి గదిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.