న్యాయబద్ధత లేని రిమాండ్ ​చెల్లదు : మంగారి రాజేందర్

న్యాయబద్ధత లేని రిమాండ్ ​చెల్లదు : మంగారి రాజేందర్

కాగ్నిజబుల్​ నేర సమాచారం అందగానే పోలీస్​స్టేషన్​ఇన్​చార్జి ఆఫీసర్​ఎఫ్ఐఆర్​విడుదల చేస్తారు.  అలా చేయాలని క్రిమినల్​ ప్రొసీజర్ కోడ్​లోని సెక్షన్​154 చెబుతున్నది. ఆ ఒరిజినల్​ ఎఫ్ఐఆర్ ను సంబంధిత మెజిస్ట్రేట్​కు పంపించి కేసు దర్యాప్తు మొదలు పెట్టాలి. మొదట నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది. నేరం ఎలా జరిగిందన్న విషయం తెలుసుకుంటాడు. సాక్షులను విచారిస్తాడు. నేర స్థలాన్ని పరిశీలిస్తాడు. అక్కడ ఏమైనా సాక్ష్యాలుంటే సేకరిస్తాడు. నేరంతో సంబంధం ఉన్న వ్యక్తులను గుర్తిస్తాడు. ఆ తర్వాతే అవసరమైతే ముద్దాయిని అరెస్ట్​ చేయడానికి అవకాశం ఉంది. దర్యాప్తులో ముద్దాయి అరెస్ట్​ అనేది చివరి దశ. అరెస్ట్​ అవసరం అయితేనే చేయాలి. ఈ విషయాన్ని క్రిమినల్ ​ప్రొసీజర్​కోడ్​లోని సెక్షన్157 చెబుతున్నది. జోగిందర్​ కుమార్​కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయం చెప్పింది. అరెస్ట్​ చేసే అధికారం ఉండటం ఒక ఎత్తు అయితే, దానికి న్యాయబద్ధత ఉండటం మరొక ఎత్తని పేర్కొన్నది. అరెస్ట్​ చేసే అధికారం ఉన్నంత మాత్రాన అరెస్ట్​ చేయకూడదు. ఆ అరెస్ట్​ అవసరమై ఉండాలి. దానికి న్యాయబద్ధత కూడా ఉండాలి. 

అక్రమ అరెస్టులను ఆపేందుకే..41 ఏ

సుప్రీంకోర్టు ఇంత చెప్పినా.. అక్రమ అరెస్టులు కొనసాగుతూనే ఉండటం చూసి పార్లమెంట్​అరెస్ట్​అధికారాలకు సవరణలను తీసుకువచ్చింది. సెక్షన్​41 రూపురేఖలను మార్చివేసింది. ‘41ఏ’ అన్న కొత్త నిబంధన తీసుకువచ్చింది. 2010లో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. దీన్ని సక్రమంగా అమలు చేయడం కోసం సుప్రీంకోర్టు ఆర్నేష్​కుమార్​కేసులో కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తూ, వాటిని పోలీసులు, మెజిస్ట్రేటులు పాటించాలని ఆదేశించింది. పాటించని అధికారుల మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. ఏడేండ్లు గానీ, ఏడేండ్ల కన్నా తక్కువ శిక్ష విధించే అవకాశం ఉన్న నేరాల్లో నేరస్తులను పోలీసులు అరెస్ట్​ చేయకూడదు. వారు ఆ నేరం చేశారని సాక్ష్యాలు ఉన్నప్పటికీ వాళ్లను అరెస్ట్​చేయకూడదు. నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేస్తే సరిపోతుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అరెస్టు చేసే వీలు ఉంది. వాళ్లు తిరిగి ఏమైనా నేరాలు చేయకుండా నిరోధించడానికి, దర్యాప్తు సక్రమంగా నిర్వహించడానికి, ఆ వ్యక్తుల వల్ల సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశం ఉన్నప్పుడు, సాక్షులను ప్రభావితం చేయకుండా ఉంచే సందర్భంలోనే అరెస్ట్​ చేసే అవకాశం ఉంటుంది. అయితే ముందుగా 41ఏ ప్రకారం నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను పోలీసులు దుర్వినియోగం చేస్తూనే ఉన్నారు. కొన్ని కేసుల్లో ముద్దాయిలకు నోటీసులు ఇచ్చి స్టేషన్​బెయిల్​ అనే కొత్త పద్ధతిని కనిపెట్టారు. అలాంటి పద్ధతి చట్టంలో ఎక్కడా లేదు. నేరస్తులను అరెస్టు చేయాలనుకున్నప్పుడు పైన చెప్పిన కారణాల్లో ఏదో ఒక కారణం చూపి రిమాండ్​కు పంపిస్తున్నారు. 

తమిళనాడులోని మతివనన్​ కేసులో..

పోలీసులు రిమాండ్​చేయమని కోరగానే రిమాండ్​చేయకుండా ‘41ఏ’ను పాటించారా? అన్న విషయాన్ని రిమాండ్​ చేసే న్యాయమూర్తులు చూడాల్సి ఉంటుంది. వాళ్లు మేజిస్ట్రేట్స్​కావొచ్చు, సెషన్స్​జడ్జీలు కావొచ్చు.. పోలీసులు పేర్కొన్న నేరాలకు తగిన సాక్ష్యాలు ఉన్నాయా? లేదానన్న విషయాన్ని చూడాల్సి ఉంటుంది. తగిన సాక్ష్యాలు లేనప్పుడు, 41 ఏ నిబంధనలను పాటించనప్పుడు ఆ ముద్దాయిలను ఆ కేసు నుంచి విడుదల చేయాలి. అంటే రిమాండ్​ను తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను పాటించని న్యాయమూర్తులపై హైకోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో రిమాండ్​లను తిరస్కరిస్తున్న సందర్భాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం పోలీసుల దర్యాప్తు సరిగ్గా లేకపోవడం. ‘41ఏ’లో చెప్పిన ప్రకారం వాళ్లు దర్యాప్తు చేయకపోవడం, అక్రమంగా అరెస్టులు చేయడం. తమిళనాడులో ఒక 
మేజిస్ట్రేట్​ రిమాండ్ ​తిరస్కరించిన ఉదంతం మద్రాస్​ హైకోర్టు పరిశీలనకు వచ్చింది. ఆ కేసులో ఆ మెజిస్ట్రేట్​ను మద్రాస్​ హైకోర్టులోని డివిజన్​బెంచ్​అభినందించింది. మెజిస్ట్రేట్ ​ఇలా ఉండాలని తన తీర్పులో పేర్కొన్నది. మతి వనన్​ వర్సెస్​ ఇన్​స్పెక్టర్​ ఆఫ్​ పోలీస్​ కేసులో వాది మతివనన్ ​సీపీఐ(ఎంఎల్) ఆఫీస్​ బేరర్. ఆ పార్టీ తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. బహిరంగంగా పని చేస్తున్న సంస్థ అది. ‘షూటింగ్ ప్రాక్టీస్ ​కోసం సిరుమలై కొండలకు వెళ్లాను’ అని అతను కామెంట్​పెడుతూ ఒక ఫొటోను తన ఫేస్​బుక్ ​అకౌంట్​లో పోస్టు చేశాడు. దానికి పోలీసులు అతనిపై120బీ, 122, 505(1)(బీ), 507 ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపించారు. వడిపట్టి మెజిస్ట్రేట్​అరుణ్​ ఆ రిమాండ్​ను తిరస్కరించారు. ఆ నేరాలు అతడు చేశాడనడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని రిమాండ్​ను తిరస్కరిస్తూ ఉత్తర్వులు రాశారు. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్​ను రద్దు చేయాలని మతివనన్​మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు ఆ మెజిస్ట్రేట్​ఉత్తర్వును సమర్థిస్తూ ఆ రాష్ట్రంలోని మెజిస్ట్రేట్లు కూడా అలా న్యాయబద్ధంగా ఉండాలని చెబుతూ ఎఫ్ఐఆర్​ను కొట్టివేసింది.

ప్రివెన్షన్ ​ఆఫ్ ​కరెప్షన్​ చట్టం 

ప్రివెన్షన్​ఆఫ్​కరెప్షన్​చట్టం విషయానికొస్తే సెక్షన్​8 ప్రకారం ఎవరైనా నేరం చేస్తే, అది రుజువైతే ఆ వ్యక్తులను ఏడేండ్ల వరకు శిక్ష గానీ, జరిమానా గానీ లేదా రెండింటిని గానీ కోర్టు విధించవచ్చు. భారతీయ శిక్షా స్మృతిలోని 9–ఏ అనేది ఎన్నిక నేరాలకు సంబంధించినది. 171–బి కింద నేరం చేసిన వ్యక్తులకు సెక్షన్​171 – ఈ ప్రకారం శిక్షలు విధిస్తారు. ఇది నాన్​ కాగ్నిజబుల్​ నేరం. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా ఈ నేరాలను పోలీసులు దర్యాప్తు చేయడానికి వీల్లేదు. చాప్టర్​9–ఏ ప్రకారం ఏ నేరానికి కూడా 7 సంవత్సరాల వరకు శిక్షలు లేవు. సెక్షన్​8 కరప్షన్​ యాక్ట్​ గానీ, చాప్టర్​9–ఏ, ఐపీసీలోని నేరాలు గానీ ఏవీ కూడా ఈ ఎమ్మెల్యేల ఉదంతం విషయానికి వర్తించవు. అవి ఎలా వర్తిస్తాయో చెప్పాల్సిన బాధ్యత పోలీసుల మీదే ఉంది. ఏది ఏమైనా రిమాండ్లను యాంత్రికంగా చేయకూడదు. అది న్యాయపరమైన చర్య. అందుకుని మెజిస్ట్రేట్స్, జడ్జిలు జాగ్రత్తగా చేయాలి. న్యాయబద్ధత లేనప్పుడు రిమాండ్​ను తిరస్కరించడం, ముద్దాయిలను వదిలిపెట్టడం సరైన చర్య. ఈ రకంగా వ్యవహరించిన న్యాయమూర్తులను హైకోర్టు, సుప్రీంకోర్టులే కాదు ప్రజలంతా అభినందిస్తారు.

న్యాయమూర్తుల బాధ్యత

తాజాగా హైదరాబాద్​లో జరిగింది కూడా మతి వనన్ వర్సెస్​ఇన్​స్పెక్టర్​ ఆఫ్​పోలీస్ కేసు ఇలాంటిదే. పోలీసులు పంపిన రిమాండ్​ను ఏసీబీ న్యాయమూర్తి తిరస్కరించినట్లు అన్ని పత్రికల్లో వచ్చింది. 41ఏ నిబంధనలను పాటించలేదని న్యాయమూర్తి తన ఉత్తర్వులో పేర్కొన్నట్టు వార్తలు కన్పించాయి. దీని వల్ల రిమాండ్​ తిరస్కరణ అన్న విషయం చర్చలోకి వచ్చింది. పోలీసులు తమకు తోచిన, తమకు అర్థమైన సెక్షన్లను పెట్టి ఎఫ్ఐఆర్​ను విడుదల చేస్తారు. ఇలా 41ఏ నిబంధనలను పాటించని సందర్భాలు ఎన్నో. పోలీసులు పెట్టిన సెక్షన్ల ప్రకారం సాక్ష్యాలు ఉన్నాయా? అన్న విషయాన్ని రిమాండ్​చేసే మెజస్ట్రేట్​ గానీ, న్యాయమూర్తి గానీ పరిశీలించాలి. వ్యక్తి స్వేచ్ఛ అనేది అత్యంత విలువైన అంశం. దానికి ఎలాంటి భంగం కలగుకుండా, అధికార దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మేజిస్ట్రేట్​పై ఉంటుంది. ముద్దాయిని తన ముందు హాజరు పరచగానే అన్ని పత్రాలను మేజిస్ట్రేట్​ క్షుణ్నంగా పరిశీలించాలి. సాక్షుల స్టేట్​మెంట్లను కూడా చూడాలి. రిమాండ్​ చేయడానికి సంతృప్తికరమైన కారణాలు ఉన్నాయని మేజిస్ట్రేట్​ భావించినప్పుడే రిమాండ్ ​చేయాలి. పోలీసులు రిమాండ్ ​అడిగారు కదా అని రిమాండ్​ చేయకూడదు. రిమాండ్ ​చేయడానికి కేసులోని విషయాలతోపాటు, క్రిమినల్​ ప్రొసీజర్​కోడ్​లోని సెక్షన్​41ని, రాజ్యాంగంలోని ఆర్టికల్​21ను కూడా మేజిస్ట్రేట్స్ ​తమ దృష్టిలో పెట్టుకోవాలి. అలా చూడకుండా రిమాండ్​చేస్తే వారు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తులుగా మిగిలిపోతారు. అనవసరంగా ముద్దాయి జైలులో ఉండాల్సి వస్తుంది.

- మంగారి రాజేందర్,

రిటైర్డ్ జిల్లా జడ్జి