ఆన్ లైన్ లో రెమ్ డెసివిర్.. వాట్సప్, SMS ద్వారా ఆర్డర్లు

ఆన్ లైన్ లో రెమ్ డెసివిర్.. వాట్సప్, SMS ద్వారా ఆర్డర్లు

రాష్ట్రంలో రెమ్ డెసివిర్ కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్ లో రెమ్ డెసివిర్ ఔట్ లెట్ మూసాపేటలో ఒక్కటే ఉండటంతో.. భారీ క్యూలు కనిపించాయి. గంటలకొద్దీ జనం క్యూలో నిలబడి ఇంజక్షన్లను కొనుగోలు చేశారు ప్రజలు. కానీ ఇంజక్షన్ తయారీ సంస్థపై బ్లాక్ మార్కెట్ ఆరోపణలు వచ్చాయి. ఔట్ లెట్ కు తక్కువ డోసులు పంపుతూ.. బ్లాక్ మార్కెట్ కు ఎక్కువగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆన్ లైన్ లో రెమ్ డెసివిర్ ఇంజక్షన్ల అమ్మకాలు జరుపుతామని తయారీ సంస్థ ప్రకటించింది. మూసాపేటలోని ఔట్ లెట్ ను మూసేసింది.

కరోనా బాధితులు ఎక్కువ కావటంతో రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లకు డిమాండ్ భారీగా పెరిగింది. గత నాలుగు రోజులుగా కరోనా రోగుల కుటుంబ సభ్యులు వేల సంఖ్యలో ఔట్ లెట్ దగ్గర క్యూకడుతున్నారు. డిమాండ్ కు సరిపడా ఇంజెక్షన్లు సరఫరా చేయటం సాధ్యం కాకపోవటంతో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో కొందరు బ్లాక్ మార్కెట్ దందా మొదలుపెట్టారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయటంతో.. బ్లాక్ మార్కెట్ ఆరోపణలకు బలం చేకూరింది. నిన్న ఔట్ లెట్ దగ్గర రోగుల బంధువులు వేల సంఖ్యలో క్యూకట్టారు. కానీ అర్ధరాత్రి వరకు కూడా కేవలం రెండుమూడు వందల మందికి మాత్రమే ఇంజెక్షన్లు అందాయి. దీంతో ఔట్ లెట్ సిబ్బందిపై జనం ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబ్బందితో గొడవకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారటంతో.. ఔట్ లెట్ ద్వారా రెమ్ డెసివిర్ అమ్మకాలు నిలిపేసింది తయారీ సంస్థ. ఆన్ లైన్ లో వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్లు స్వీకరిస్తామని తెలిపింది. రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు కావాలనుకునే వాళ్లు.. 91338 96969 ఫోన్ నెంబర్ కు వాట్సప్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా ఆర్డర్ చేయాలని తెలిపింది ఇంజక్షన్ తయారీ సంస్థ. పేషెంట్ పేరు, అటెండెంట్ పేరు, ఫోన్ నంబర్, హాస్పిటల్ పేరు, పేషెంట్ ఐపీ నెంబర్, సిటీ పేరుతోపాటు.. ఎన్ని వయల్స్ కావాలనే వివరాలు పంపాలని సూచించింది. అవసరమైన వారికి ఆర్డర్ సీరియల్ నెంబర్ ప్రకారం ఇంజెక్షన్ సరఫరా చేస్తామని సంస్థ తెలిపింది.