రెమ్డెసివిర్​ కొరత ఎందుకంటే..?

రెమ్డెసివిర్​ కొరత ఎందుకంటే..?

ఒక్కో ఇంజెక్షన్​ను రూ. 4‌‌‌‌0 వేలకి కూడా అమ్ముతున్నారు
మార్కెటింగ్​లో  అధిక లాభం కంపెనీలదా, డిస్ట్రిబ్యూటర్లదా తెలీడం లేదు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: యాంటి వైరల్​ డ్రగ్​ రెమ్డెసివిర్‌‌‌‌ డిమాండ్​ ఊహకి కూడా అందకుండా పెరుగుతోంది. పేషెంట్ల ప్రాణాలు కాపాడడానికి దేశవ్యాప్తంగా డాక్టర్లు రెమ్డెసివిర్​కే మొగ్గు చూపుతుండటంతో దాని కొరత విపరీతంగా పెరిగిపోతోంది. మరోవైపు బ్లాక్​మార్కెటీర్లు ఇదే అదనుగా రేట్లను బాగా పెంచేస్తున్నారు. ఒక్కో ఇంజెక్షన్​ను రూ. 40 వేలకి కూడా బ్లాక్​ మార్కెటీర్లు అమ్ముతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఈజీగానే అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఒక డ్రగ్​  డిమాండ్​ ఇంతలా పెరిగిన దాఖలాలు లేవని కూడా ఎనలిస్టులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు,  ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నా, ప్రొడక్షన్​ పెరగడానికి ఇంకొంత టైము పడుతుందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. ఇంకో యాంటివైరల్ డ్రగ్‌‌ అందుబాటులో లేకపోవడంతో ఈ మెడిసిన్‌‌ను వాడుతున్నామని మెడికల్​ ప్రొఫెషనల్స్​ చెబుతున్నారు. ఈ డ్రగ్‌‌ మాత్రమే కాకుండా కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో వాడే ఫావిపిరవిర్‌‌‌‌, లోసిలిజుమాబ్‌‌, ఐటోలిజుమాబ్ వంటి డ్రగ్స్‌‌ కొరత కూడా ఏర్పడుతోంది. 
రెమ్డెసివిర్‌‌‌‌ తెగ వాడుతున్నారు..
పేషెంట్ల హాస్పిటలైజేషన్ పిరియడ్‌‌ను కొంత వరకు తగ్గించడంలో ఈ మెడిసిన్ ఉపయోగపడుతుందని ఎఫ్‌‌డీఏ అంచనావేస్తోంది. పేషెంట్ల ప్రాణాలను కాపాడడమే ఇప్పుడు ముఖ్యం కావడంతో డాక్టర్లు రెమ్డెసివిర్​ మీదే ఆధారపడుతున్నారు. పేషెంట్ల ఫ్యామిలీల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో,  మరొక యాంటి వైరల్‌‌ డ్రగ్‌‌ లేకపోవడంతో రెమ్డెసివిర్‌‌‌‌ను వాడుతున్నారు. దీంతో ఈ మెడిసిన్‌‌ డిమాండ్​ అమాంతం పెరిగింది. ప్రభుత్వం కూడా రెమ్డెసివిర్‌‌‌‌ వాడకంపై ఈ నెల 22 న  కొన్ని గైడ్‌‌లైన్స్‌‌ను ప్రకటించింది. కేవలం హాస్పిటలైజ్‌‌ అయిన కరోనా పేషెంట్‌‌కు, అది కూడా ఆక్సిజన్‌‌ సపోర్ట్‌‌ అవసరం ఉన్న పేషెంట్ల ట్రీట్‌‌మెంట్‌‌లో మాత్రమే రెమ్డెసివిర్‌‌‌‌ను వాడాలని గైడ్‌‌లైన్స్‌‌ను ఇష్యూ చేసింది. సింప్టమ్స్‌‌ బయటపడిన 10 రోజుల్లోనే ఈ మెడిసిన్‌‌ను వాడాలని తెలిపింది. 200 ఎంజీ ఇంజెక్షన్‌‌ను మొదట వేయాలని, ఆ తర్వాత నాలుగు రోజులు 100 ఎంజీ చొప్పున వేయాలని రికమండ్ చేసింది. ఇళ్లలో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్న వారికి,  ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేని పేషెంట్లకు రెమ్డెసివిర్‌‌‌‌ వేయొద్దని తెలిపింది.
డిసెంబర్‌‌‌‌ నుంచి ప్రొడక్షన్‌‌ తగ్గింది..
అమెరికన్ కంపెనీ గలియడ్‌‌తో ఒప్పందం కుదుర్చుకున్న  ఏడు ఇండియన్ ఫార్మా కంపెనీలు ప్రస్తుతం రెమ్డెసివిర్‌‌‌‌ డ్రగ్‌‌ను తయారు చేస్తున్నాయి. సిప్లా, హెటెరో, డా.రెడ్డీస్‌‌, కాడిలా హెల్త్‌‌కేర్‌‌‌‌, జుబిలంట్‌‌ ఫార్మా, మైలాన్‌‌, సింజిని ఇంటర్నేషనల్‌‌ కంపెనీలు ఈ డ్రగ్‌‌ను తయారు చేస్తున్నాయి. కిందటేడాది నవంబర్‌‌‌‌ తర్వాత కరోనా కేసులు తగ్గడంతో ఈ డ్రగ్‌‌ తయారీని కంపెనీలు తగ్గించేశాయి. డిమాండ్‌‌ తగ్గడంతో  కిందటేడాది డిసెంబర్‌‌‌‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య  రెమ్డెసివిర్‌‌‌‌ డిమాండ్ తగ్గిందని కంపెనీలు చెబుతున్నాయి. గరిష్ట స్థాయి ప్రొడక్షన్‌‌లో 5–10 శాతానికి ఈ మెడిసిన్ తయారీ పడిపోయిందని పేర్కొంటున్నాయి.  రెమ్డెసివిర్‌‌‌‌ను స్టోర్ చేయడానికి కోల్డ్‌‌ స్టోరేజ్‌‌ ఫెసిలిటీ అవసరం కాబట్టి ఒకే సారి ఇన్వెంటరీని పెట్టుకోవాలని హాస్పిటల్స్‌‌, కంపెనీలు చూడడం లేదు. దీంతో సడెన్‌‌గా డిమాండ్‌‌ పెరిగినా సప్లయ్‌‌ 
చేయలేకపోతున్నాయి.  

ప్రొడక్షన్‌‌ పెరుగుతోంది..
ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో రెమ్డెసివిర్ ప్రొడక్షన్ తిరిగి పీక్ స్టేజ్‌‌కు చేరుకుంది. ఈ డ్రగ్‌‌ను, ఏపీఐల ఎగుమతులను కేంద్ర బ్యాన్ చేసింది. ఈ డ్రగ్‌‌పై కస్టమ్స్‌‌ డ్యూటీని రద్దు చేసింది. దీంతో కంపెనీలు తమ ప్రొడక్షన్‌‌ను పెంచాయి. డిమాండ్ విపరీతంగా పెరగడంతో కరోనా మొదటి వేవ్‌‌ టైమ్‌‌లో ప్రొడ్యూస్‌‌ చేసిన రెమ్డెసివిర్‌‌‌‌ కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రొడ్యూస్‌‌ చేస్తున్నామని సిప్లా స్పోక్స్‌‌పర్సన్‌‌ పేర్కొన్నారు. కాడిలా హెల్త్‌‌ కేర్‌‌‌‌ కూడా రెమ్డెసివిర్ ప్రొడక్షన్‌‌ను రెండు రెట్లు పెంచింది. హెల్త్ మినిస్ట్రీ డేటా ప్రకారం దేశంలో రెమ్డెసివిర్ కెపాసిటీ నెలకు 38.8 లక్షల వయల్స్‌‌ నుంచి 78 లక్షల వయల్స్‌‌కు పెరిగింది. కంపెనీలు కూడా ఈ డ్రగ్‌‌ రేట్లను 25–70 శాతం వరకు తగ్గించాయి. ముందు ఈ డ్రగ్‌‌ను ప్రొడ్యూస్ చేసిన తర్వాత స్టెరిలిటీ టెస్ట్‌‌ ఉండేది. దీన్ని చేయడానికి 14 రోజుల వరకు తీసుకునే వారు. ప్రస్తుతం త్వరగా క్లియరెన్స్‌‌లిస్తుండడంతో ప్రొడక్ట్‌‌ను మార్కెట్లోకి వేగంగా 
తీసుస్తున్నాయి.