హైదరాబాద్, వెలుగు: నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) న్యూరోసర్జరీ విభాగం వైద్యులు వైద్య రంగంలో మరో మైలురాయిని అధిగమించారు. అత్యంత సంక్లిష్టమైన మెదడు కణితిని ఎటువంటి పెద్ద గాయం లేకుండా, కంటి గవ్వ (ఐ సాకెట్) సహజ మార్గం ద్వారా విజయవంతంగా తొలగించారు. అత్యాధునిక ఎండోస్కోపిక్ ట్రాన్స్‌ఆర్బిటల్ అప్రోచ్ (ఈటీఓఏ) పద్ధతిని ఉపయోగించి ఈ అరుదైన శస్త్రచికిత్సను పూర్తి చేశారు.
మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండలం మధుర్ గ్రామానికి చెందిన మంగలి లత (50) తీవ్రమైన తలనొప్పితో నిమ్స్‌లో చేరారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆమె కంటి వెనుక భాగంలోని పుర్రె అడుగున కణితి ఉన్నట్టు గుర్తించారు. సాధారణంగా ఇలాంటి సమస్యలకు తల ఎముకను తెరిచే క్రానియోటమీ శస్త్రచికిత్స చేస్తారు. అయితే, రోగి వేగంగా కోలుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్లు ఈటీఓఏ పద్ధతిని ఎంచుకున్నారు. కనుబొమ్మ వద్ద ఉండే మడతలో చిన్న కోత పెట్టి, హై-డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో కణితిని చేరుకుని తొలగించారు.
పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. 10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ కింద పూర్తి ఉచితంగా అందించారు. శస్త్రచికిత్స తర్వాత లత కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన డాక్టర్ల బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప అభినందించారు.
