వనపర్తిలో జర్నలిస్టుల ప్లాట్ల హద్దు రాళ్లు తొలగింపు

వనపర్తిలో జర్నలిస్టుల ప్లాట్ల హద్దు రాళ్లు తొలగింపు

వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లలో హద్దు రాళ్లను ఆదివారం అర్ధరాత్రి తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం వనపర్తి రూరల్  పోలీస్ స్టేషన్​లో బాధ్యులను గుర్తించి అరెస్ట్​  చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టర్  తేజస్  నంద్ లాల్  పవార్ ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

జిల్లా కేంద్రంలో 82 మంది జర్నలిస్టులకు ఇచ్చిన ఇంటి స్థలాలను రక్షించాలని కోరారు. హద్దురాళ్లు తొలగిస్తున్న వారి వెహికల్స్​ వివరాలు పోలీసులకు చెప్పామని, అక్కడే ఉన్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తెచ్చారు. నిందితులను శిక్షించి, తిరిగి రాళ్లు పాతించాలని పట్టుబట్టారు. కలెక్టర్ తో మాట్లాడి దీనిపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తనదని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.