- న్యాయపరమైన సలహా తీసుకుంటున్న ఉన్నతాధికారులు
- హెచ్ఎండీఏలో పలువురు ఉద్యోగులకు నోటీసులు ఇచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: అక్రమాస్తుల కేసులో ఏసీబీ అదుపులో ఉన్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివ బాలకృష్ణను అధికారులు సర్వీసు నుంచే తొలగించేందుకు రెడీ అవుతున్నట్లు ఆ శాఖలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి వారు న్యాయపరమైన సలహా తీసుకుంటున్నట్టు సమాచారం. గతంలో శివ బాలకృష్ణ పనిచేసిన హెచ్ఎండీఏలోనూ ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా ఆయన అరెస్టు, విచారణ హెచ్‌ఎండీఏలో పనిచేసే పలువురు అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఆయన అరెస్ట్‌తో జీహెచ్‌ఎంసీ, టౌన్ ప్లానింగ్, సీడీఎంఏ అధికారుల్లో సైతం టెన్షన్ మొదలైంది. బాలకృష్ణ ప్రలోభాలకు గురైన అధికారుల్లో గుబులు పుట్టింది. బాలకృష్ణ హామీతో హెచ్ఎండీఏలో ఫైల్స్‌పై సంతకాలు చేసిన ఇతర అధికారులకు సైతం త్వరలో ఏసీబీ నోటీసులిచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
హెచ్‌ఎండీఏ పరిధిలో బాలకృష్ణ అనుమతి ఇచ్చిన ప్రాజెక్టులను క్లియర్ చేసిన ఏఎంయూడీ అధికారులు సైతం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తున్నది. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా బాలకృష్ణ పనిచేస్తున్నటైమ్లో ఆయన దగ్గర పనిచేసిన పలువురు ప్లానింగ్ అధికారులు కూడా పలు లేఔట్ యజమానుల నుంచి ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లానింగ్ విభాగంలో ఫైల్ కదలాలంటే ఏజెన్సీ ద్వారా వెళ్లాలి.
అధికారులకు నచ్చిన ఏజెన్సీల ద్వారా వెళితే ఎలాంటి సమస్య ఉన్నా దానికి ఒక రేటును ఫిక్స్ చేసి వెంటనే అనుమతులను ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదులు అందినా.. పట్టించుకోలేదు. బాలకృష్ణ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో కొందరు ఆయన చెప్పిందే వేదంగా పనిచేశారన్న ఆరోపణలు వచ్చాయి.
