- ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర
- మెట్రోను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసత్య ప్రచారం
- టీఆర్ఎస్ లో మావోయిస్టు భావజాల నేతలున్నది నిజమే
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
- మానకొండూరులో ఆర్ఎంపీలతో 'ఛాయ్ పే చర్చ'లో పాల్గొన్న కేంద్ర మంత్రి
కరీంనగర్, వెలుగు: దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ చొరబాటుదారుల ఓట్లను తొలగిస్తే తప్పేముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. విదేశీ ముస్లింలతో ఈ దేశ ముస్లింలను ఎందుకు పోలుస్తున్నారని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధిపొందేందుకే కాంగ్రెస్ సర్ ను వ్యతిరేకిస్తోందని విమర్శించారు. మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మానకొండూరు లోని ఓ ఫంక్షన్ హాలులో ఆర్ఎంపీలతో మంగళవారం 'చాయ్ పే చర్చ' నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ దేశ పౌరుల ఓట్లను తొలగించే హక్కు ఏ ఒక్కరికీ లేదని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్(సర్) విషయంలో కాంగ్రెస్ పార్టీ రెండు మతాల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. ' పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి పాస్ పోర్టు, వీసా లేకుండా చొరబడిన వారు ఓటర్ కార్డు పొందితే చూస్తూ ఊరుకోవాలా? విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందా? అసలు విదేశీ ముస్లింలను స్వదేశీ ముస్లింలతో ఎందుకు పోలుస్తున్నారు? ఇక్కడి ముస్లిం సమాజానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి.
అక్రమంగా వలస వచ్చిన వాళ్ల ఓట్లను మాత్రమే తొలగిస్తాం. తొలగించాలా? వద్దా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. బెంగాల్ లో అక్రమ వలసదారుల ఓట్లను తొలగించాం తప్పేముంది?' అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నారని సీఎం చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని సంజయ్ కొట్టిపారేశారు. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు సైతం మోదీ ప్రభుత్వం వేల కోట్లు ఇస్తోందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో మావోయిస్టు భావజాలం ఉన్న నేతలు ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉందని చెప్పారు. అలాంటి నేతలతో సమాజానికి పెను ప్రమాదమన్నారు. మావో భావజాలం, తుపాకీ గొట్టంతో సాధించేదేమీ లేదనే నిజాన్ని గ్రహించే మావోయిస్టు నేతలంతా లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోయారని చెప్పారు.
