
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలం రామాయి సమీపంలో ఏర్పాటు చేయనున్న రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్చేస్తూ బుధవారం బాధిత రైతులు కలెక్టర్ మీటింగ్హాల్ముందు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ.. తమ భూములు సారవంతమైన నల్లరేగడి భూములని, సాత్నాల ప్రాజెక్టు నీటి ద్వారా ఏడాదిలో రెండు పంటలు పండించేవారమని తెలిపారు.
ఎకరాలకు రూ.50 నుంచి 60 లక్షలు పలుకుతోందన్నారు. కానీ ప్రభుత్వం గతంలో ఎకరానికి రూ.9 లక్షలు చెల్లించిందని, ఇప్పుడు రూ.8.59 లక్షలకు తగ్గించి బాధితులకు నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తమకు ఎకరానికి రూ.50 లక్షల పరిహారం చెల్లించి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దీంతో రైతులతో ఆర్డీవో, రేణుక సిమెంట్యాజమాన్యం సమావేశం నిర్వహించారు. కానీ తమ డిమాండ్ నెరవేర్చే వరకు నిరసనలు ఆపబోమని రైతులు స్పష్టం చేశారు. రామాయి గ్రామస్తులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.