కవిత ఒక్కరే బాగుపడితే సరిపోతుందా?

కవిత ఒక్కరే బాగుపడితే సరిపోతుందా?
  • కేసీఆర్ దీక్ష చేస్తూ జ్యూస్‌‌‌‌లు తాగి ఇడ్లీలు తిన్న వీడియోలు మా దగ్గరున్నయ్​
  • కాంగ్రెస్​ సీనియర్​ నేత రేణుకా చౌదరి

హైదరాబాద్​, వెలుగు: ఇన్నాళ్లూ మహిళల కోసం ఏమీ చేయని సీఎం కేసీఆర్.. ఇప్పుడు వారి ఓట్ల కోసం పాకులాడుతున్నారని కాంగ్రెస్​ సీనియర్​ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. మహిళలకు ఏం చేశారని కేసీఆర్​కు ఓటేయాలని ప్రశ్నించారు. బొంతలకు కూడా పనికిరాని బతుకమ్మ చీరలను పంచి ఓట్లు అడగడం దారుణమన్నారు. సోమవారం ఆమె ఏఐసీసీ ప్రతినిధి శమా మహ్మద్​తో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేదని, బాల్యవివాహాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

 ఆడపిల్లల డ్రాపౌట్స్​ పెరుగుతున్నాయని, కనీస సౌకర్యాలు కల్పించకుండా స్కూళ్లకు రావడం లేదని అనడం దారుణమన్నారు. కవిత ఒక్కతే రాష్ట్రంలో బాగుపడితే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఆమె కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, రాష్ట్రంలోని సాధారణ మహిళలు ఏం పాపం చేశారని మండిపడ్డారు. కేసీఆర్​ తొలి కేబినెట్​లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరన్నారు. ఇప్పుడు కేవలం ఇద్దరికి ఇచ్చి.. మేమిచ్చినం అని అనడం పెద్ద జోక్​ అని ఎద్దేవా చేశారు. 

వేరే రాష్ట్రాల రైతులకు లక్షలకు లక్షలు సాయం చేసిన కేసీఆర్.. ఇక్కడి రైతులకు ఎందుకివ్వడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ హయాంలో పది రకాల సరుకులను రేషన్ ద్వారా ఇచ్చామని, ఇప్పుడు అవేవీ రావడం లేదని విమర్శించారు. కేసీఆర్ ఖమ్మం సబ్ జైలులో దీక్ష పేరిట ఆరెంజ్ జ్యూస్‌‌‌‌లు తాగి ఇడ్లీలు తిన్న వీడియోలు తన దగ్గర ఉన్నాయన్నారు. సీట్ల కేటాయింపులో కమ్మలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆమె చెప్పారు.