అగ్రి చట్టాలు: సుష్మా, జైట్లీ ఉండుంటే చర్చలు సఫలమయ్యేవి

అగ్రి చట్టాలు: సుష్మా, జైట్లీ ఉండుంటే చర్చలు సఫలమయ్యేవి

ముంబై: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలను కొనసాగిస్తున్నారు. అన్నదాతల ఉద్యమానికి విపక్ష పార్టీలతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా మద్దతునిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. రైతుల నిరసనలపై శివ సేన పార్టీ తన అధికార పత్రిక సామ్నా ఎడిటోరియల్‌‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టాలను ఉపసంహరించుకుంటే కేంద్రం తన పెద్ద మనసును చాటుకున్నట్లు అవుతుందని సూచించింది.

‘రైతులు ఢిల్లీలో తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ చట్టాలను ఉపసంహరించుకోవడంలో పెద్ద మనసు చేసుకొని వ్యవహరించాలి. ఇందులో తక్కువగా అనుకోవడానికి ఏమీ లేదు. ఈ చట్టాలను రైతులు నిరంకుశమైనవిగా భావిస్తున్నారు. ఈ చట్టాలను గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటే దాన్ని శుభ పరిణామంగా ఆహ్వానించాలి. రోజురోజుకీ పరిస్థితులు దిగజారుతున్నాయి. దీన్ని ప్రభుత్వ పనుల ఫలాలుగానే చూడాలి. బీజేపీ దగ్గర ఎన్నికల్లో గెలిపించేవారు, విజయాన్ని కొనుక్కునేవాళ్లు ఉన్నారు. కానీ రైతుల సమస్యలు, నిరుద్యోగికత లాంటి సవాళ్లను ఎదుర్కొనే వాళ్లు బీజేపీ సర్కార్‌‌లో లేరు. ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ వంటి ట్రబుల్ షూటర్లు లేని కొరత ప్రభుత్వంలో కనిపిస్తోంది. వాళ్లు ఉండుంటే చర్చలు సఫలమయ్యేవి. ఇప్పటికే ఐదు రౌండ్ల పాటు చర్చలు జరిగినా పరిష్కారం కాలేదు’ అని సామ్నాలో శివ సేన రాసుకొచ్చింది.