పాండ్యనే గెలిచాడు: కెప్టెన్‌గా ప్రకటించడానికి అసలు కారణం ఇదే

పాండ్యనే గెలిచాడు: కెప్టెన్‌గా ప్రకటించడానికి అసలు కారణం ఇదే

ఐపీఎల్ 2024 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అని నిన్న( డిసెంబర్ 15) ఆ జట్టు యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో 10 ఏళ్ళ నుంచి ముంబై జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మకు బ్రేక్ పడింది. ఫామ్ లో ఉన్నా, కెప్టెన్ గా మంచి రికార్డ్ ఉన్నా.. హిట్ మ్యాన్ ను పక్కన పెట్టడానికి కారణం ఏంటో ఎవరికీ తెలియలేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం అసలు విషయం తెలిసిపోయింది. 

2022,2023 లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించాడు. అంచనాలు లేకుండా తొలి ప్రయత్నంలోనే హార్దిక్  టైటిల్ అందించాడు. ఇక ఈ ఏడాది గుజరాత్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. మరోవైపు రోహిత్ శర్మ ఇటీవలే టీ20 కెప్టెన్సీపై ఆసక్తి లేదని చెప్పడంతో ముంబై ఫ్రాంచైజీ కన్ను హార్దిక్ మీద పడింది. దీంతో అనుకున్నట్లుగానే భారీ మొత్తం వెచ్చించి ట్రేడింగ్ ద్వారా గుజరాత్ నుంచి ముంబైకు తీసుకొని రావడంలో సఫలమయ్యారు. అయితే హార్దిక్ అంత సింపుల్ గా వచ్చాడంటే నమ్మటం కష్టమే.
 
ట్రేడింగ్ ద్వారా తాను ముంబైకు రావాలంటే కెప్టెన్సీ ఇవ్వాలని పాండ్య కోరాడట. పాండ్య రిక్వస్ట్ ను ముంబై అంగీకరించింది. ఇదే విషయాన్ని రోహిత్ కు చెప్పగా.. రోహిత్ ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా పాండ్యను సపోర్ట్ చేయడం జరిగిందట. మొత్తానికి రోహిత్ ఒప్పుకోవడంతో పాండ్యని కెప్టెన్ గా చేయడంలో ఎలాంటి సమస్య రాలేదని తెలుస్తుంది. ఒకవేళ రోహిత్ ఒప్పుకోకపోతే లెక్క మరోలా ఉండే అవకాశం లేకపోలేదు. వరల్డ్ కప్ కు ముందే రోహిత్ పాండ్యను ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చేయమని చెప్పాడట. అనుకున్న ప్రకారం కెప్టెన్సీ కొట్టేసి పాండ్య గెలవగా.. రోహిత్ తన గొప్ప మనసు అసలు విజేతగా నిలిచాడు.  
   
ఈ ప్రకటన తర్వాత ముంబై ఇండియన్స్ గంట వ్యవధిలోనే ఇంస్టాగ్రామ్ లో దాదాపు 1.5 లక్షల మంది ఫాలోవర్లను కోల్పోయింది. రోహిత్ ను విపరీతంగా అభిమానించే అభిమానులు ముంబై జట్టును అన్ ఫాలో కొట్టడంతో ఇప్పుడు ఆ జట్టు బ్రాండ్ వాల్యూ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఒక్కసారిగా హిట్ మ్యాన్ ను పక్కన పెట్టేసరికీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తూ ముంబై ఫ్రాంచైజీపై నిప్పులు చెరుగుతున్నారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకుని  జట్టును ఐదుసార్లు ఛాంఫియన్ గా నిలిపిన రోహిత్ శర్మరకు ఐపీఎల్ లో మరికొన్ని సీజన్స్  కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  

ముంబై ఇండియన్స్ తరపున 158 మ్యాచ్‌లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో 87 మ్యాచుల్లో ముంబై విజయం సాధించగా   67 మ్యాచుల్లో ఓడిపోయింది. హిట్‌ మ్యాన్‌ విజయాల శాతం 55.06. రోహిత్  తన కెప్టెన్సీతో ముంబై ఇండియన్స్ ను ఐదు సార్లు ఐపీఎల్‌ ఛాంపియన్ గా నిలిపాడు. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాలలో ముంబై ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. తాజాగా రోహిత్ ను కెప్టెన్సీ నుంచి ముంబై యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో 10 ఏళ్ళ కెప్టెన్సీకి తెరపడింది.