చెన్నై నుంచి జడేజా తప్పుకోనున్నాడా? అతని కోసం 3 జట్లు పోటీలో.. 

చెన్నై నుంచి జడేజా తప్పుకోనున్నాడా? అతని కోసం 3 జట్లు పోటీలో.. 

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నైతో తన బంధాన్ని తెంచుకోనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జడేజా గత కొన్నిరోజులుగా సీఎస్కే జట్టుకు వ్యతిరేకంగా పోస్తులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తూ వచ్చిన జడ్డూ ఇకపై అందుకు సుముఖంగా లేడని సమాచారం. జడ్డూ క్రీజులోకి వచ్చిన ప్రతీసారీ.. ధోనీ బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్న అతని అభిమానులు జడ్డూని ఔట్ కావాలని అరవడం అతన్ని బాధిస్తోంది. ఈ అవమానాన్ని తట్టుకోలేని జడేజా.. రెండ్రోజుల క్రితం 'కర్మ' సిద్ధాంతాన్ని సూచించే కొటేషన్‌ని పోస్ట్ చేశాడు.

ఆ తరువాత గుజరాత్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ పోరులో మరోసారి అలాంటి ఘటనలే పునరావృతమవ్వడం జడ్డూ సహించలేకపోయాడు. ఆ మ్యాచ్ ముగిశాక సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ మైదానంలోకి వెళ్లి జడేజాను శాంతి పరచడం అందరూ చూశారు. ఇదొక్కటే కాదు.. గతేడాది టీం మేనేజ్మెంట్ కెప్టెన్సీ నుంచి తప్పించి అవమానించిందట. అయితే ఎంఎస్ ధోనీ స్వయంగా కల్పించుకొని జడ్డూ, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ మధ్య సంధి చేశాడట. వీటన్నిటిని బట్టి జడ్డూ వచ్చే సీజన్ లో మరో ప్రాంచైజీ చెంతకు చేరాలనుకున్నట్లు తెలుస్తోంది. 

జడేజా కోసం ముగ్గురు పోటీలో.. 

చెన్నై జట్టులో జడేజా సంతృప్తికరంగా లేడని ఎప్పటినుంచో వస్తున్న వార్తలే. గతేడాదే తప్పుకోనున్నాడని జోరుగా చర్చ జరిగింది. అయినా జడేజా ఈ ఎడిషన్‌లో సీఎస్కే జట్టులో కొనసాగాడు. అయితే ఈసారి అవకాశం లేదని క్రికెట్ పండితులు చెప్తున్నారు. తప్పుకోవడం ఖాయమని సూచిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే, జడేజా వేలం జాబితాలోకి చేరితే.. అతన్ని సొంతం చేసుకునేందుకు ఇతర జట్లు పోటీపడడం సహజమే. మూడు జట్లు అతనిపై ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉంది.

జడ్డూని సొంతం చేసుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అందరికంటే ముందువరుసలో ఉంది. ఆర్సీబీ లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా బలహీనంగా ఉంది. ఆ లోటుతోనే ఈ సీజన్ లో పరాజయాలు మూటగట్టుకుంది. జడేజా ఆర్సీబీ వశమైతే ఆ లోటు పూడినట్లే. ఐపీఎల్ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్‌ కూడా జడ్డూ మీద ఆసక్తి చూపుతోంది. స్పిన్ పరంగా బలంగా లేని ముంబై, అతనితో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని చూస్తోంది. ఇక గతేడాది ఈ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఈ రేసులో ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించే సత్తా ఉన్న జడేజాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది.