పాకిస్తాన్ జట్టులో విభేదాలు.. కెప్టెన్, బౌలర్ మధ్య మాటల యుద్ధం!

పాకిస్తాన్ జట్టులో విభేదాలు.. కెప్టెన్, బౌలర్ మధ్య మాటల యుద్ధం!

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమిపాలై.. టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ ఒక్క ఓటమి పాకిస్తాన్ జట్టును కుదిపేస్తోంది. ఇప్పటికే సొంత అభిమానులు, మీడియా దుమ్మెత్తిపోస్తుంటే.. మరోవైపు ఆటగాళ్ల మధ్య అంతర్గత విభేదాలు మొదలైనట్లు ఆ దేశ మీడియా కోడైకూస్తోంది. ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‍లో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది మధ్య మాటల యుద్ధం నడిచినట్టు సమాచారం.

శ్రీలంకతో ఓటమి అనంతరం ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్.. డ్రెస్సింగ్ రూమ్‍లో ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఉద్దేశించి మాట్లాడుతూ మొత్తం జట్టు ప్రదర్శనపై తన నిరాశను వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది . ఈ క్రమంలోనే అతనికి, షాహీన్ షా అఫ్రిదికి మధ్య వాగ్వాదం జరిగిందన్నది ఆ వార్తల సారాంశం. 

"ఖుద్ కో జ్యాదా సూపర్ స్టార్స్ నా సంఝేన్, వరల్డ్ కప్ సర్ పే హై. అగర్ హమ్ ఏక్ హోకర్ ఖేల్తే తో మ్యాచ్ జీత్ సక్తే ది (మిమ్మల్ని మీరు సూపర్ స్టార్స్ అని అనుకోకండి.. ప్రపంచకప్ రాబోతోంది. అందరి కళ్లు మనపైనే ఉన్నాయి. మీరు ఇలానే ఆడితే, మిమ్మల్ని త్వరలోనే మర్చిపోవాల్సి వస్తుంది. జట్టుగా ఆడినప్పుడే విజయం సాధించగలం.." అని బాబర్ సహచరులతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ సమయంలో ఆఫ్రిది కలగచేసుకుని.. "కనీసం బాగా బౌలింగ్, బ్యాటింగ్ చేసిన వారిని మెచ్చుకోవాలని.." అని చెప్పాడట. అందుకు బాబర్.. "ఎవరు బాగా రాణిస్తున్నారో.. ఆసియా కప్‌లో ఎవరు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించారో తనకు తెలుసు.."అని చెప్పాడట. ఇలానే ఇరువురి మధ్య వాగ్వాదం పెద్దగా అవుతుంటే.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కలుగజేసుకొని ఇద్దరినీ శాంతింపజేశాడని సమాచారం. రహస్యంగా ఉండాల్సిన ఈ విషయం ఎలా బయటకు పొక్కిందో కానీ, పాక్ మీడియా ఈ విషయంపై డిబేట్ లు పెడుతోంది. దీనిపై పాక్ క్రికెటర్లు స్పందించాల్సి ఉంది.

చివరి బంతికి విజయం

కాగా, తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ పరాజయం పాలైంది. వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‍ను 42 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 252 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో లంక చివరి బంతికి విజయం సాధించింది. చివరి రెండు బంతులకు ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. ఐదో బంతి ఎడ్జ్ తీసుకొని ఫోర్ పోగా, చివరి బంతికి చరిత్ అసలంక రెండు రన్స్ తీశాడు. దీంతో శ్రీలంక గెలిచింది.