పాక్ క్రికెట్ బోర్డుకు ఆర్థిక కష్టాలు.. 4 నెలలుగా ఆటగాళ్లకు జీతాల్లేవ్!

పాక్ క్రికెట్ బోర్డుకు ఆర్థిక కష్టాలు.. 4 నెలలుగా ఆటగాళ్లకు జీతాల్లేవ్!

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. గత నాలుగు నెలలుగా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించలేని దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంలో పాక్ క్రికెట్ బోర్డుపై.. ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగా స్పాన్సర్‌షిప్ లోగోలను, ప్రపంచ కప్ ప్రమోషన్లను బహిష్కరిస్తామని ఆటగాళ్లు పీసీబీని బెదిరించినట్లు నివేదికలు చెప్తున్నాయి.

నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడే అగ్రశ్రేణి క్రికెటర్లకు నెలవారీ ఫీజు పాకిస్తాన్ కరెన్సీలో 4.5 మిలియన్లు అందిస్తోంది. ఇందులో పన్నులు పోను క్రికెటర్లు 2.2 నుండి 2.3 మిలియన్లు(పాకిస్తాన్ కరెన్సీలో) మాత్రమే అందుకుంటారు. ఆ డబ్బులు కూడా పీసీబీ ఆటగాళ్లకు సకాలంలో చెల్లించలేకపోతోంది.  

పీసీబీలో అవినీతి

అలా అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయం లేదని కాదు. పీసీబీలో అవినీతి రాజ్యమేలుతోంది. వివిధ ఆర్థిక మార్గాల ద్వారా పిసిబికి 9.8 బిలియన్ రూపాయలు అందుతున్నట్లు నివేదికలు బయటపెట్టడంతో ఆటగాళ్లు తమ వాటాకై డిమాండ్ చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ జాప్యం కారణంగా ఆటగాళ్లు ప్రపంచ కప్ మ్యాచ్ లలో తమ షర్టులపై కార్పొరేట్ లోగోలను ధరించేందుకు నిరాకరించినట్లు సమాచారం. అయితే ఈ వార్తలపై ఆటగాళ్లు కనే, బోర్డు కానీ నోరు మెదపకపోవడం గమనార్హం.