రాజకీయాల్లోకి సీమా హైదర్!‌.. ఆహ్వానించిన అథవాలే పార్టీ నేత

రాజకీయాల్లోకి సీమా హైదర్!‌.. ఆహ్వానించిన అథవాలే పార్టీ నేత

పబ్జీలో పరిచయమైన యువకుడి కోసం పాకిస్తాన్ నుంచి నలుగురు పిల్లలతో భారత్‌కు అక్రమ మార్గంలో ప్రవేశించిన సీమా హైదర్‌కు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. సీమా హైదర్‌కు ఇటీవల బాలివుడ్‌ సినిమాలో ఆఫర్‌ రాగా, తాజాగా రాజకీయాల్లోకి కూడా ఆమెకు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేత మాసూమ్ కిషోర్ దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సీమా హైదర్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు మాసూమ్ కిషోర్. పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేస్తామని చెప్పారు. సీమా హైదర్‌ హిందీ, ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతుండటంతో పార్టీ అధికార ప్రతినిధి అయ్యే అవకాశం కూడా ఉందన్నారు. అంతేగాక తమ పార్టీ తరుఫున ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. సీమా గురించి దర్యాప్తు జరుగుతుండటంతో సంబంధిత సంస్థల నుంచి క్లీన్‌చిట్‌ కోసం తాము ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

పాకిస్తాన్ మహిళ సీమా హైదర్‌  రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరడంపై ఆ పార్టీ చీఫ్‌, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే శుక్రవారం (ఆగస్టు 4న) స్పందించారు. ఆమెతో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని తెలిపారు. పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్‌ను తమ పార్టీలో చేర్చుకునే ప్రశ్నే లేదన్నారు. మాసూమ్ కిషోర్ తనను సంప్రదించకుండానే ఆ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఒకవేళ ఆమెకు టికెట్‌ ఇవ్వాల్సి వస్తే భారత్‌ నుంచి పాకిస్తాన్ వెళ్లేందుకు టికెట్‌ ఇస్తామని, ఎన్నికల్లో పోటీ కోసం కాదని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల సచిన్‌ మీనాతో ఆన్‌లైన్‌ పబ్జీ గేమ్‌ ద్వారా 30 ఏళ్ల సీమా హైదర్‌ పరిచయమైంది. పాకిస్తాన్ లో భర్తను వీడి నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మేలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. హిందూ మతంలోకి మారానని, సచిన్‌, తాను పెళ్లి చేసుకున్నామని చెప్పింది. పాక్‌కు తిరిగి వెళ్లనని, ఇక్కడే ఉంటానని చెబుతోంది. తన పిల్లలతో కలిసి భారత్‌లో ఉండేందుకు అనుమతించాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాభిక్ష పిటిషన్‌ కూడా పెట్టుకుంది. సీమా హైదర్‌ భారత్ లోకి అక్రమంగా ప్రవేశించడంతో ప్రస్తుతం ఆమెపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.