అర్బనైజేషన్తో పర్యావరణానికి సవాళ్లు: రెరా చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ

అర్బనైజేషన్తో పర్యావరణానికి సవాళ్లు: రెరా చైర్మన్ డాక్టర్ సత్యనారాయణ
  • ప్రకృతిని నాశనం చేసిన ఏ నాగరికత కూడా మనుగడ సాగించలే
  • ప్రతిఒక్కరూ రీసైక్లింగ్ పై దృష్టి పెట్టాలని సూచన

గచ్చిబౌలి, వెలుగు:  దేశంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ పర్యావరణానికి పెను సవాల్​గా మారుతోందని తెలంగాణ రియల్ ఎస్టేట్  రెగ్యులేటరీ అథారిటీ (రెరా)  చైర్మన్  డాక్టర్  ఎన్.సత్యనారాయణ అన్నారు. ప్రకృతిని ధ్వంసం చేసిన ఏ నాగరికత కూడా మనుగడ సాగించలేదని, చరిత్రను చూస్తే ఈ విషయం అర్థం అవుతుందన్నారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్  స్టాఫ్  కాలేజ్  ఆఫ్  ఇండియా (ఎస్కీ) లో  నిర్వహిస్తున్న ‘సస్టైనబుల్  వేస్ట్  మేనేజ్ మెంట్  త్రూ సర్క్యులర్  ఎకానమీ అండ్  టెక్నాలాజికల్  ఇన్నొవేషన్’ అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు సోమవారం ప్రారంభమైంది. 

ఈ సదస్సును సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భూగ్రహం తన శక్తిని మించి మోస్తున్నదని, పర్యావరణ కాలుష్యం, సమతుల్యత దెబ్బతినడం కారణంగా ఉపద్రవాలు సంభవిస్తున్నాయన్నారు. ‘‘ప్రస్తుతం ఒక్క రోజుకు 1.60 మెట్రిక్  టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. పట్టణీకరణ పెరిగితే ఇది మరింత పెరుగుతుంది. పాత కాలంలో గ్రామాల్లోని ప్రతి ఇంట్లో కంపోస్టు గుంత ఉండేది. చెత్త బయటకు రాకపోగా, ఇంట్లో ఎరువుగా మారేది. కానీ, ఈరోజుల్లో పట్టణాల్లో చెత్త నేరుగా డంపింగ్  యార్డుకు చేరుతోంది. 

ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు వేస్ట్ తో రీసైక్లింగ్ మీద దృష్టి పెట్టాలి’’ అని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ మాజీ చైర్మన్  సి.అచలేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం వేగంగా కలుషితం అవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఐఐ వైస్ చైర్మన్  ఎం.గౌతంరెడ్డి, వరల్డ్  బ్యాంకు కన్సల్టెంట్ డీఏ మోహన్, ఎన్విరాన్మెంట్  క్లియరెన్స్  ఆఫ్  ఇరిగేషన్  అండ్  హైడ్రోపవర్  ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్  డాక్టర్  పీజీ శాస్త్రి, ఎస్కీ డైరెక్టర్  జి.రామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.