మద్యం షాపులకు రిజర్వేషన్లా?

మద్యం షాపులకు రిజర్వేషన్లా?

హైదరాబాద్, వెలుగు:  రిజర్వేషన్ల పద్దతిలో మద్యం షాపులు కేటాయించాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. తెలంగాణ రిపబ్లికన్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎ.ఆనంద్ వేసిన పిల్‌‌‌‌ను హైకోర్టు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ రెడ్డిల డివిజన్ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 15.45%, 9.08% ఎస్టీలు ఉన్నారని, ఆ రేషియోలో మద్యం షాపుల రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని పిటిషన్‌‌‌‌లో పేర్కొన్నారు. ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫున లాయర్ వాదించారు. దీనిపై స్పందించిన బెంచ్‌‌‌‌.. మద్యం షాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించింది. హైకోర్టు అడిగిన ప్రశ్నకు అఫిడవిట్‌‌‌‌లో సమాధానం చెబుతామని, గడువు కావాలని లాయర్‌‌‌‌‌‌‌‌ కోరారు. అంగీకరించిన బెంచ్‌‌‌‌, విచారణను డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 20కి వాయిదా వేసింది. 

విగ్రహాల ఏర్పాటుపై సుప్రీం గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ అమలు చేయాల్సిందే
పబ్లిక్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ల్లో లీడర్ల విగ్రహాలు పెట్టకూడదని చెప్పిన సుప్రీంకోర్టు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను హైకోర్టు హెచ్చరించింది. గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ ఉల్లంఘన జరిగినట్లు తమ దృష్టికి వస్తే సుమోటోగా కోర్టు ధిక్కార కేసుగా పరిగణించి విచారిస్తామని చెప్పింది. బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, ఫుట్‌‌‌‌పాత్‌‌‌‌లపై  విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని 2013లో ఫిబ్రవరి 13న ఉమ్మడి ఏపీ సర్కార్‌‌‌‌ ఉత్తర్వులు అమలు కావడం లేదని దాఖలైన రిట్‌‌‌‌ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ సతీశ్‌‌‌‌ చంద్రశర్మ, జస్టిస్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌రెడ్డిల డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం విచారించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ను ఏ మేరకు అమలు చేస్తున్నారో చెప్పాలంది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.