ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లోని వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్‌తో కలిసి శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. ఆమన్‌గల్ మున్సిపాలిటీలో 15 వార్డులు, చేవెళ్లలో 18, ఇబ్రహీంపట్నంలో 24, మొయినాబాద్‌లో 26, షాద్‌నగర్‌లో 28, శంకర్‌పల్లిలో 15 వార్డులకు ఎస్టీ, ఎస్టీ(మహిళ), ఎస్సీ, ఎస్సీ(మహిళ), బీసీ, బీసీ(మహిళ), అన్ రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ (మహిళ) కేటగిరీల్లో రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఆమన్‌గల్‌లో 7 వార్డులు, చేవెళ్లలో 9, ఇబ్రహీంపట్నంలో 12, మొయినాబాద్‌లో 13, షాద్‌నగర్‌లో 14, శంకర్‌పల్లిలో 7 వార్డులను మహిళలకు కేటాయించారు. డెడికేషన్ కమిషన్ నివేదిక, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు.
మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో ఇలా..
మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ మున్సిపల్ ఎన్నికల వార్డు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించి ఆయా కలెక్టర్లు శనివారం గెజిట్ విడుదల చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా తీసి రిజర్వేషన్లు ఖరారు చేశామన్నారు.
