మెట్రో కూత.. శబ్దాల మోత.. రెండేండ్ల నుంచి పట్టాలు, రైళ్ల​సౌండ్స్​తో నిద్రలేని రాత్రులు

 మెట్రో కూత.. శబ్దాల మోత.. రెండేండ్ల నుంచి పట్టాలు, రైళ్ల​సౌండ్స్​తో నిద్రలేని రాత్రులు
  •    బోయిగూడలోని ఓ అపార్టుమెంట్ ​వాసులకు ఇబ్బందులు 
  •     పలుమార్లు అధికారులకు కంప్లయింట్ చేసినా పరిష్కరించలే 
  •     ఇటీవల సీఎం రేవంత్​కు లెటర్​రాసిన అపార్ట్​మెంట్ ​వాసులు
  •     కొత్త ప్రభుత్వమైనా శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకోలు

హైదరాబాద్, వెలుగు: సిటీకి మెట్రోరైల్ వచ్చి ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందిస్తుండగా.. మరికొందరికి ఇబ్బందిగా మారింది. బోయిగూడలోని మెట్రో వై జంక్షన్​ పిల్లర్​ నంబర్ 1006 వద్ద ఎంఎన్​కే విట్టల్ కోర్టు వ్యూ అపార్ట్​మెంట్​వాసులు మెట్రో రైలు శబ్దాలతో రెండేండ్లుగా సరిగ్గా నిద్రపోవట్లేదు. రోజూ రైళ్ల రాకపోకలతో వై జంక్షన్​వద్ద ట్రాక్, వీల్స్​కు మధ్య రాపిడితో భారీ శబ్దాలు వస్తున్నాయి. మెయింటనెన్స్, ట్రయల్స్ పేరిట మిడ్‌‌నైట్‌‌లోనూ ట్రైన్స్ నడుపుతుండగా.. ఆ శబ్దాలకు నిద్రపట్టడం లేదని అపార్టుమెంట్​ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రైళ్లు జంక్షన్​వద్దకు రాగానే హారన్  శబ్దాలతో నిద్రలేమి, యాంగ్జయిటీ, స్ట్రెస్​, బీపీ, హార్ట్​ప్రాబ్లమ్​.. వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.  

బోయిగూడ వై జంక్షన్​ దగ్గరలోని బాబూఖాన్​టవర్(అనిష్​ టవర్), ఎస్ఎంఆర్​రెసిడెన్సీ, సెంట్రల్​వ్యూ అపార్ట్​మెంట్, ఇండిపెండెంట్​హౌసెస్​వాసులు మెట్రో శబ్దాలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై రెండేండ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా తాత్కాలికంగా కొన్ని మరమ్మతులు చేసి వదిలేశారు. ఆరు నెలలుగా శబ్దాలు ఎక్కువయ్యాయని బాధితులు పేర్కొంటున్నారు. రెగ్యులర్ గా గ్రీజ్, లుబ్రికెంట్​పెడితే సౌండ్స్​తగ్గే చాన్స్ ఉంటుంది. కానీ హైదరాబాద్​మెట్రో రైల్​లిమిటెడ్​(హెచ్ఎంఆర్ఎల్​), ఎల్అండ్ టీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 

కేటీఆర్, తలసానికి ఫిర్యాదు చేస్తే..

గతంలో మున్సిపల్​కమిషనర్​కు, న్యూఢిల్లీలోని నేషనల్​అడ్మినిస్ట్రేటివ్​అండ్​పబ్లిక్ గ్రీవెన్సెస్, నేషనల్​గ్రీన్​ ట్రిబ్యునల్ చైర్మన్​కు ఎంఎన్​కే అపార్టుమెంట్ వాసులు కంప్లయింట్ చేశారు. అయినా ఫలితం లేదు. గత మున్సిపల్​శాఖ మంత్రి​కేటీఆర్​కు కూడా ఫిర్యాదు చేశారు. 

ఆ సమయంలో మెట్రో అధికారులు రైల్వే ట్రాక్​కు గ్రీజ్​పెట్టించి తాత్కాలికంగా సౌండ్స్​రాకుండా చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఎప్పటిలాగే సౌండ్స్​మళ్లీ మొదలయ్యాయి. మాజీ మంత్రి, సనత్​నగర్​ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అపార్ట్​మెంట్​లో ముఖాముఖి నిర్వహించి మెట్రోరైలు శబ్దాలను స్వయంగా విన్నారు. మెట్రో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత పట్టించుకోవడం మానేశారు. 

లేఖ ద్వారా సీఎం రేవంత్ కు వినతి  

రెండేండ్లుగా అధికారులు, నేతలకు కంప్లయింట్ చేసి విసిగిపోయామని, ప్రస్తుతం కొత్త ప్రభుత్వమైనా తమ సమస్యకు చూపుతుందని అపార్టుమెంట్​వాసులు భావిస్తున్నారు. ఈనెల 22న సీఎం రేవంత్​రెడ్డికి తమ సమస్యపై లేఖ రాశారు. తమకు శాశ్వత పరిష్కారం చూపాలని అందులో కోరారు. అదేవిధంగా కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​యాదవ్​కు కూడా లేఖలను పంపించారు.

శాశ్వత పరిష్కారం చూపాలి 

అధికారులకు కంప్లయింట్ చేస్తే టెంపరరీగా ఏదో చేసి వెళ్తారు. మళ్లీ వారానికే సౌండ్స్​వస్తాయి. ఆరు నెలలుగా ఎన్ని కంప్లయింట్లు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. టెంపరరీ సొల్యూషన్స్​కాకుండా పర్మినెంట్​గా సమస్యకు పరిష్కారం చూపాలి.
-  డాక్టర్ హనుమాండ్లు, ప్రెసిడెంట్,​ ఎం
ఎన్​కే విఠల్ సెంట్రల్ కోర్టు అపార్ట్​మెంట్
 

రెండేండ్లుగా భరించలేకపోతున్నాం.. 

వై జంక్షన్​కు రాగానే ట్రెయిన్​ హారన్​వేస్తున్నారు. కొన్ని బోగీలు వచ్చినప్పడు సౌండ్​ ఎక్కువగా వస్తుంది.  అధికారులకు కంప్లయింట్ చేస్తే కింది నుంచే చూసి వెళ్తారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డికి ఫిర్యాదు చేశాం.  యాక్షన్​ తీసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకు చర్యలేం తీసుకోలేదు. 
- నరసింహారావు, ఎంఎన్​కే విఠల్​
సెంట్రల్​ కోర్టు అపార్టుమెంట్  
 

వారంలోగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తం 
 

ఎంఎన్​కే అపార్ట్​మెంట్​వాసుల సమస్య మా దృష్టికి వచ్చింది. ఎల్​అండ్ టీ అధికారులతో మాట్లాడాం. వారం రోజుల్లో  సమస్యకు పరిష్కారం చూపిస్తం. మళ్లీ రిపీట్​అవ్వకుండా చర్యలు తీసుకుంటాం.
- బీఎన్​రాజేశ్వర్, హెచ్​ఎంఆర్ఎల్, 
జనరల్​ మేనేజర్​(వర్క్స్)