- అందరినీ ఆదుకుంటం.. 10 వేల కోట్లయినా ఖర్చు చేస్తం
- కేటీఆర్, హరీశ్, ఈటల.. సెక్రటేరియెట్‌కు వచ్చి సలహాలు ఇవ్వండి
- కమిటీ వేస్తం.. అందులో మీకూ చోటు కల్పిస్తం
- అవసరమైతే రేస్ కోర్స్, పోలీస్ అకాడమీని తరలిద్దామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మూసీ నిర్వాసితులను అనాథలను చేయమని, వాళ్లందరి బాధ్యతను తానే తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిర్వాసితులందరినీ ఆదుకుంటామని, అందుకోసం రూ.10 వేల కోట్లయినా ఖర్చు చేస్తామని చెప్పారు.“కాకా జయంతి సందర్భంగా మాట ఇస్తున్నా.. మూసీ నిర్వాసితులందరికీ తప్పకుండా ప్రత్యామ్నాయం చూపిస్తం. రెచ్చగొట్టేటోళ్ల మాటలు నమ్మకండి. వాళ్ల ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. మీ దగ్గరకు వచ్చి మీ సానుభూతి పొందాలని, మిమ్మల్ని అడ్డుపెట్టుకొని వాళ్ల ఆస్తులు కాపాడుకోవాలని కుట్ర రాజకీయాలు చేస్తున్నోళ్లను నిలదీయండి” అని అన్నారు.
శనివారం కాకా జయంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మూసీ నిర్వాసితులను రెచ్చగొడుతున్నోళ్లు.. ముందుకువచ్చి వాళ్లకు ఏం చేయాలో చెబితే బాగుంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఇద్దామా? పరిహారం ఇద్దామా? చెప్పాలని కోరారు. అధికారులను పంపిస్తామని, బాధితులను కూర్చోబెట్టి మాట్లాడాలని, ఎంత నష్టపరిహారం ఇవ్వాలో నిర్ణయించాలని ప్రతిపక్ష నేతలకు సూచించారు. ‘‘ఈటల రాజేందర్, కేటీఆర్, హరీశ్ రావు.. మీరు సెక్రటేరియెట్ కు రండి. మా భట్టి, పొన్నం, అధికారులు అంతా ఉంటారు.
మా ప్లాన్ అంతా మీకు వివరిస్తాం. మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయంగా ఏం చేయాలో సలహాలు, సూచనలు ఇవ్వండి. లేదంటే అలాగే వదిలేద్దాం అంటే అదైనా చెప్పండి” అని కోరారు. పేదోళ్లను ఆదుకునే అంశంలో కాకా వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకుందామన్నారు. ‘‘హైదరాబాద్ లో ప్రభుత్వ జాగాలు చాలా ఉన్నాయి. అక్కడ ఏం చేద్దామో చెప్పండి. మలక్ పేట రేస్ కోర్స్ లో 150 ఎకరాల జాగా ఉంది. అంబర్ పేట లో 150 ఎకరాల్లో పోలీస్ అకాడమీ ఉంది. వీటిని సిటీ బయటకు తరలించి అక్కడ పేదలకు ఇండ్లు కట్టిద్దాం. దీనిపై కమిటీ వేద్దాం. ఈటల, కేటీఆర్, హరీశ్ రావుకు ఇందులో చోటు కల్పిస్తాం. ముందుకు రండి.. సలహాలు ఇవ్వండి. మీకు పదేండ్ల అనుభవం ఉంది అని అంటున్నరు. మీ ఆస్తులు ఇవ్వకపోయినా.. పేదవాళ్లకు కోసం మీ సలహాలు అయినా ఇవ్వండి” అని కోరారు.
దోచుకున్న దాంట్లో 10 శాతం ఇవ్వండి..
బీఆర్ఎస్ నేతలు పదేండ్లలో దోపిడీ చేసిన దాంట్లో 10 శాతం ఇచ్చినా మూసీ నిర్వాసితుల జీవితాలు బాగుపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. “బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1,500 కోట్లు ఉన్నాయి. అందులో రూ.500 కోట్లు ఇవ్వండి. అందరికీ పంచిపెడదాం. జన్వాడలో 50 ఎకరాల ఫామ్‌హౌస్ ఉంది. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులో 500 ఎకరాలు చేయండి. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం. జన్వాడ ఫామ్ హౌస్ లో 25 ఎకరాలు ఇవ్వండి. పది అంతస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాను. ఇవన్నీ మీరు దోచుకుంటే వచ్చినవే.
మీ తాతలు ఇచ్చినవి కావు. కేసీఆర్, హరీశ్ రావు 2004, 2009 ఎలక్షన్ అఫిడవిట్లు మా దగ్గర ఉన్నయ్. మీకు పేపర్లు, టీవీలు, ఫామ్‌హౌస్ లు, వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి? తెలంగాణ ఉద్యమంలో పిల్లలందరూ చనిపోతుంటే.. మీ ఆస్తులు గుట్టల వలే పెరిగినయ్. మీరు వందలు, వేల ఎకరాల్లో జమీందార్లలాగా బతుకుతరు.. పేదలు మాత్రం మూసీలో బతకాల్నా. వాళ్లకు మంచి జీవితాలు వద్దా? వాళ్ల పిల్లలు చదువుకోవద్దా? వాళ్లకు సౌకర్యాలు కల్పించవద్దా?” అని ప్రశ్నించారు.
అట్లయితే మన బతుకులు మూస్కపోతయ్..
పేదల బాధలు తనకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘ఇండ్లు పోతే బాధ ఉంటది. పేదోళ్ల బాధ ఎలా ఉంటదో తెలియకుండానే ఈ స్టేజ్ కి వచ్చిన్నా. పేదలను ఎలా ఆదుకుందామో చెప్పండి.. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుదాం. హైదరాబాద్ నగరాన్ని ఎలా బాగుచేద్దామో చెప్పండి” అని ప్రతిపక్షాలను ఆయన కోరారు. ‘‘హైదరాబాద్ లో చెరువులు, వాగులు, నాలాలు మూస్కపోతే, కబ్జాలకు గురయితే.. గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది. వరదలు వస్తే నీళ్లు పోయే మార్గం కూడా ఉండదు. అప్పుడు నగరమే మాయమవుతుంది. పేదలు, ధనవంతులు చెరువులు, నాలాలు, నదులు ఆక్రమిస్తే.. చివరకు అవి మూస్కపోతే, మన బతుకులు కూడా మూస్కపోతయ్” అని అన్నారు.
ఈటలకు ఇబ్బందేంటి?
ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని, ఎవరిపైనా కోపం లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. “మోదీ గుజరాత్ లో సబర్మతి నదిని క్లీన్ చేశారు. 64 వేల కుటుంబాలను తరలించారు. అందులో 16 వేల మందికే పరిహారం ఇచ్చారు. మోదీ గుజరాత్ మోడల్ అద్భుతమంటూ ఈటల రాజేందర్ చప్పట్లు కొడతున్నారు. మరి అలా మూసీని డెవలప్ చేసుకుంటే రాజేందర్ కు వచ్చిన ఇబ్బంది ఏంటి?” అని ప్రశ్నించారు. మూసీని డెవలప్ చేయాలని గత ప్రభుత్వంలోనే జీవోలు ఇచ్చారని, ఆ ప్రభుత్వంలో ఈటల మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు.
రుణమాఫీపై చర్చ చేద్దామా?
ప్రభుత్వం ఏం చేసినా అడ్డుకోవడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘‘22లక్షల 22వేల 663 మంది రైతులకు రూ.18వేల కోట్ల రుణాలు మాఫీ చేసినం. రూ.2 లక్షలు పైన లోన్ ఉన్నోళ్లు.. పైన అమౌంట్ కడితే మాఫీ చేస్తమని చెప్పినం. ఇప్పుడు రుణమాఫీ చేయలేదని దిక్కుమాలినోడు దీక్ష చేస్తున్నడు. మీరు పదేండ్లలో లక్ష రుణమాఫీ చేస్తమని చేయలేదు. 2018 నుంచి 2023 వరకు మీరు చేసిన మాఫీ రూ.11 వేల కోట్లు. మేం చేసింది 25 రోజుల్లో రూ.18వేల కోట్లు. అన్ని వివరాలు ఇస్తా.. చర్చ చేద్దామా?” అని సవాల్ విసిరారు. రుణమాఫీ విషయంలో రైతులకు ఎవరికైనా ఇంకా సమస్యలుంటే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కౌంటర్ కు వెళ్లి అడగాలని సూచించారు. కాగా, కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ సన్మానించారు. కాకా జీవిత చరిత్ర పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు అందజేశారు.