ఇంకా భయం గుప్పిట్లోనే నల్లగుట్ట..

ఇంకా భయం గుప్పిట్లోనే నల్లగుట్ట..

సికింద్రాబాద్: అగ్ని ప్రమాద ఘటన నుంచి నల్లగుట్టలోని కాలనీలు, కాచిబౌలి బస్తీ వాసులు ఇంకా తేరుకోలేదు. ఇప్పటికీ వారు భయం భయంగానే గడుపుతున్నారు. ప్రమాద సమయంలో  మంటల తీవ్రత అధికంగా ఉండటంతో బస్తీ జనాన్ని, చుట్టుపక్కల అపార్ట్​మెంట్ వాసులను పోలీసులు, అధికారులు అప్పటికప్పుడు సహాయక శిబిరాలకు తరలించారు. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో గురువారం రాత్రే కొందరు తిరిగి ఇంటి ముఖం పట్టారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ కు కొద్ది దూరంలో ఉన్న తేరాపంత్  భవన్​లో పునరావాసం కల్పించగా.. చాలా మంది బస్తీ వాసులు తిరిగి రాత్రే తమ ఇండ్లకు వెళ్లిపోయారు. ఇదే  ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న అపార్ట్​మెంట్లలో ఉన్న వారిని పోలీసులు అప్పటికపుడు ఖాళీ చేయించి బయటకు పంపారు.

అయితే అర్ధరాత్రి వరకు రోడ్లపైనే ఉన్న మరికొంత మంది అపార్ట్​మెంట్ వాసులు  ఇటు ఇండ్లకు వెళ్లలేక, అటు పునరావాస కేంద్రంలో ఉండలేక సిటీలోని తమ బంధువులు, స్నేహితుల ఇండ్లల్లో తలదాచుకున్నారు. వారిలో కొందరు శుక్రవారం మధ్యాహ్నం తన ప్లాట్లకు చేరుకోగా ఇంకా కొందరు బయటే ఉన్నారు. ప్రమాదం జరిగిన డెక్కన్ నైట్​వేర్ స్పోర్ట్స్ మాల్ బిల్డింగ్​లో శుక్రవారం సైతం వేడి తీవ్రత తగ్గలేదు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. గల్లంతైన వారి కోసం బంధువులు బిల్డింగ్ బయటే ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. 

పొగతో చిన్నారులకు ఎఫెక్ట్

ప్రమాదం కారణంగా వెలువడిన పొగ.. చుట్టుపక్కల ఉండే వృద్ధులు, చిన్నారులు, ఫైర్ సిబ్బందిలో తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని సైంటిస్టులు, డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. మంటల్లో కెమికల్స్, రబ్బర్,  ప్లాస్టిక్, సింథటిక్ బట్టలు కాలిపోవడంతో దట్టమైన పొగ వెలువడి.. అదంతా బయటి గాలిలో కలిసిపోవడంతో  వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ ప్రాంతం చుట్టుపక్కల 2 నుంచి 3 కి.మీ పరిధిలో ఉండే వారు వారం రోజుల వరకు మార్నింగ్ వాక్ కు వెళ్లొద్దని.. ముఖ్యంగా చిన్నారులను తీసుకెళ్లద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికెళ్లేవారు మాస్క్​లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.