ఇంద్రవెల్లి, వెలుగు: కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజలకు ముందు నిర్వహించే ప్రధాన ఘట్టాన్ని మెస్రం వంశీయులు బుధవారం పూర్తిచేశారు. డిసెంబర్30న కేస్లాపూర్ నుంచి గంగాజల సేకరణకు కాలినడకన బయలుదేరిన మెస్రం వంశీయులు ఈ నెల 7న జన్నారం మండలం హస్తిన మడుగులో గంగాజలాన్ని సేకరించి తిరుగుపయనమయ్యారు.
బుధవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం గౌరీ నుంచి పాదయాత్రగా ఆదివాసీ సంప్రదాయ డోలు వాయిద్యాల నడుమ ఇంద్రవెల్లికి చేరుకొని ఆదివాసీల ఆరాధ్య దైవం ఇంద్రాదేవి ఆలయం వద్ద ఉన్న మర్రి చెట్టుపై సేకరించిన గంగాజలం ఝరి(కలశం)ను భద్రపరిచారు.
ఇంద్రాదేవికి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఎడ్లబండిపై తరలివచ్చిన మెస్రం వంశీయులు ప్రత్యేక నైవేద్యాలు తయారు చేసి ఇంద్రాదేవికి సమర్పించారు. అనంతరం కలశంతో బయలుదేరారు. కేస్లాపూర్‌లోని మర్రిచెట్ల వద్దకు చేరుకొని అక్కడే బస చేయనున్నట్లు మెస్రం పెద్దలు తెలిపారు. కేస్లాపూర్లో ప్రత్యేక పూజలతో 18న నాగోబా జాతర ప్రారంభం కానుంది.
