- ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి
జైనూర్, వెలుగు: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల సహకారంతో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. బుధవారం జైనూర్ ఎంపీడీవో కార్యాలయంలో జైనూర్, సిర్పూర్ (యూ) మండలాలకు చెందిన కల్యాణలక్ష్మి-, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులను ఏఎంసీ చైర్మన్ విశ్వనాథ్ రావుతో కలిసి పంపిణీ చేశారు.
మూడు మండలాల్లోని మొత్తం 173 మందికి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారంపై సర్పంచ్‌లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
బాధిత కుటుంబాలకు ఓదార్పు
గత నాలుగు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ మహ్మద్ పజీల్ బీయాబాని కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బీయాబాని చేసిన సామాజిక సేవలు ప్రజలు మరచిపోలేనివని అన్నారు. అనంతరం జామ్నీ, సడక్‌గూడ గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు
జైనూర్ మండలం కాలేజీగూడాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. వివిధ గ్రామాలకు చెందిన సుమారు 70 మంది, పలువురు ఉప సర్పంచులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి వారికి పార్టీ కండువాలు కల్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు మాడవి సోంబాబు, కొడప ప్రకాశ్, మడావి కౌసల్య, బీఆర్ఎస్ రాష్ట్ర నేత మర్సుకోల సరస్వతి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావు, సహకార సంస్థ మాజీ చైర్మన్ కొడప హన్ను పటేల్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇంతియాజ్ లాల, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
