రోడ్ల దుస్థితిపై వినాయక హిల్స్ కాలనీ వాసుల ఆందోళన

రోడ్ల దుస్థితిపై  వినాయక హిల్స్ కాలనీ వాసుల ఆందోళన

రోడ్డు డ్రైనేజీ అధ్వాన్న పరిస్థితిలో ఉన్నా మంత్రి సబిత ఇంద్రారెడ్డి, స్థానిక కార్పొరేటర్ దీపికా శేఖర్ రెడ్డి పట్టించుకోవడం లేదని బడంగ్ పేట్ లోని  వినాయక హిల్స్  కాలనీ వాసులు ఆందోళన చేశారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మస్ గూడ 5వ డివిజన్. వినాయక హిల్స్ కాలనీలో రోడ్లు డ్రైనేజ్  పరిస్థితులు దారుణంగా మారడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై  బైకులు, కార్లు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, గత మూడు సంవత్సరాలుగా అభివృద్ధి జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.  మీర్ పేట్, GHMC మున్సిపల్ కార్పొరేషన్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్... ఈ ముడు కార్పొరేషన్ పరిధిలు ఇక్కడే ఉంటాయని ఈ సందర్భంగా తెలిపారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉంది... అదే పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ రోడ్లు ఎలా ఉంది.. అని కాలనీ వాసులు ప్రశ్నించారు.

వినాయక హిల్స్ కాలనీలో ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడం తమ దౌర్భాగ్యమని.. ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడుకు వెళ్లి ప్రచారం చేస్తున్న మంత్రి సబిత ఇంద్రారెడ్డి... ఒక్కసారైనా తమ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించండి అని విన్నవించుకున్నారు. ఇక్కడ ఏం అభివృద్ధి చేసిందని అక్కడ పోయి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని నిలదీశారు. సమస్యలు ఎన్నిసార్లు వివరించినా పట్టించుకోవడం లేదన్నాన్న కాలనీ వాసులు... స్థానిక కార్పొరేటర్ గెలిచిన తర్వాత రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నాయన్నారు. కార్పొరేటర్ కి కేవలం ఇల్లు కడితే డబ్బులు వసూలు  చేయడం తప్ప మరో పని లేదని విమర్శించారు. అభివృద్ధి చేయని పక్షంలో తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.