
మరాఠా రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే పిలుపునిచ్చిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. సీఎంఓ మహారాష్ట్ర అప్‌లోడ్ చేసిన లేఖలో రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. సంఘం కోరిన విధంగా కోటా కల్పించేందుకు అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ ప్రక్రియకు సమయం పడుతుందని, డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వానికి అవసరమైన సమయం ఇవ్వాలని కోటా డిమాండ్ చేసే వారికి లేఖలో పేర్కొన్నారు. నిరాహార దీక్ష విరమించి ప్రభుత్వానికి సహకరించాలని ఆందోళనకు దిగిన మరాఠా కోటా కార్యకర్త మనోజ్ జరంగేకు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, విజయ్ వాడెట్టివార్, అంబాదాస్ దాన్వే, అనిల్ పరబ్, జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత నానా పటోలే, బాలాసాహెబ్ థోరట్ తదితరులు సంతకాలు చేశారు.
ఆందోళనల పేరుతో వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింసాకాండ, నిరసనల ఘటనలను కూడా లేఖలో బలంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టంగా పేర్కొన్నట్లు అఖిలపక్ష సమావేశం ప్రకటన పేర్కొంది.
కాగా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగామనోజ్ జరంగే 2023 అక్టోబర్ 25 నుండి జాల్నా జిల్లాలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మరాఠా రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటాయి. సీఎం షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు కూడా నిరసనలకు మద్దతుగా తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ALSO READ :- కల్వకుర్తి పర్యటన.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ