రూ.50వేలకు మించితే పట్టుకునుడే.. ఎన్నికల కోడ్​ ఎఫెక్ట్​.. పోలీసుల తనిఖీలు

రూ.50వేలకు మించితే పట్టుకునుడే.. ఎన్నికల కోడ్​ ఎఫెక్ట్​.. పోలీసుల తనిఖీలు
  • నగదు రిలీజ్‌‌కు ముగ్గురితో గ్రీవెన్స్‌‌ కమిటీ
  • ప్రతిరోజు సాయంత్రం 4  గంటలకు మీటింగ్​ 
  • సరైన ఆధారాలు చూపిస్తే వెంటనే రిలీజ్​ 
  • రూ.10 లక్షలు దాటితే ఐటీకి అప్పగింత

మంచిర్యాల, వెలుగు: లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ శనివారం సాయంత్రం విడుదలైన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా మోడల్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​ అమల్లోకి వచ్చింది. దీంతో రూ.50 వేలకు మించిన నగదు, బంగారం, వెండితోపాటు విలువైన వస్తువుల తరలింపుపై ఆంక్షలు కొనసాగుతాయి. ఎన్నికల్లో ధనప్రవాహాన్ని అరికట్టేందుకు చెక్ ​పోస్టులు ఏర్పాటు చేయడమే కాకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. రూ.50 వేలకు మించి నగదు, బంగారం, వెండి తరలించే క్రమంలో వాటికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.

లేదంటే పట్టుబడిన నగదు, వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకొని, సీజ్​ చేస్తారు. రూ.10 లక్షలకు మించి పట్టుబడితే ఇన్​కమ్ ట్యాక్స్​అధికారులకు అప్పగిస్తారు. పెండ్లిళ్ల సీజన్​ కావడంతో బట్టలు, బంగారం, ఇతర వస్తువుల కొనుగోళ్లకు సంబంధించిన బిల్స్​ దగ్గర ఉంచుకోవాలి. హాస్పిటల్స్ లో వైద్య ఖర్చుల కోసం భారీగా డబ్బు తీసుకెళ్తున్న వారు కూడా వాటికి సంబంధించిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. 

నగదు రిలీజ్​కు కమిటీ

సామాన్య ప్రజలు వివిధ అవసరాల కోసం తీసుకెళ్తున్న నగదు, బంగారం తనిఖీల్లో పట్టుబడితే ఆధారాలను పరిశీలించి రిలీజ్​ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  గ్రీవెన్స్​ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా పరిషత్​ సీఈఓ, జిల్లా ఎన్నికల ఖర్చు పర్యవేక్షణ అధికారి, జిల్లా ట్రెజరీ ఆఫీసర్​ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రోజూ సాయంత్రం 4 గంటలకు కలెక్టరేట్​లో సమావేశమై పట్టుబడిన నగదు, బంగారంపై సమీక్షిస్తుంది. సరైన ఆధారాలు చూపిస్తే రిలీజ్​ చేస్తారు. నగదు రూ.10 లక్షలకు మించితే ఇన్​కమ్ ​ట్యాక్స్​ అధికారులకు అప్పగిస్తారు. అనంతరం కోర్టుకు ఆధారాలు సమర్పించి నగదును విడిపించుకోవాల్సి ఉంటుంది.