- మధ్యలోనే ఆగిన గురుకుల పీఈటీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- ఎప్పుడు పూర్తి చేస్తారోనని అభ్యర్థుల ఎదురుచూపులు
హైదరాబాద్, వెలుగు: గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టుల భర్తీ.. ఆలస్యం అవుతూనే ఉంది. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ఇచ్చి నాలుగేండ్ల అవుతున్నా, ఎగ్జామ్ రిజల్ట్ ఇచ్చి మూడేండ్లు అవుతున్నా.. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మాత్రం పూర్తి కాలేదు. దీంతో అభ్యర్థులు తమకు జాబ్ వస్తుందో రాదో అనే ఆందోళనలో ఉన్నారు. పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారోనని ఎదురుచూస్తున్నారు.
2017 ఏప్రిల్ 14న నోటిఫికేషన్
రాష్ట్రంలోని ఐదు సంక్షేమ శాఖల గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల భర్తీకి 2017 ఏప్రిల్ 14న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేసింది. ట్రైబల్ వెల్ఫేర్ పరిధిలో 83 పోస్టులు, సోషల్ వెల్ఫేర్లో 182, బీసీ వెల్ఫేర్లో 135, మైనార్టీ వెల్ఫేర్లో 194, స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీఆర్ఈఐఎస్ లో 22 పోస్టులున్నాయి. మొత్తం 15 వేల వరకు అప్లికేషన్లు రాగా, అదే ఏడాది సెప్టెంబర్లో జరిగిన రాత పరీక్షకు సుమారు11 వేల మంది హాజరయ్యారు. 2018 మే12న టీఎస్పీఎస్సీ 1:2 రేషియోలో 1,200 మంది మెరిట్ లిస్టు ప్రకటించింది. 2018 మే18 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించింది. కానీ కొందరు డిప్లొమా అభ్యర్థులు కోర్టుకు పోవడంతో ఈ ప్రాసెస్ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో అభ్యర్థులు టీఎస్పీఎస్సీ, ప్రగతిభవన్ ముందు నిరసనలు చేపట్టారు.
హైకోర్టు ఆదేశించినా..
నోటిఫికేషన్లో పేర్కొన్న 616 పోస్టులను ఎన్సీఈఆర్టీ రూల్స్ప్రకారం భర్తీ చేయాలని గత నెలలో హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. 1 నుంచి 8వ తరగతి వరకు, 9 నుంచి 10 తరగతులకు రెండు కేటగిరీల పోస్టుల భర్తీకి కావాల్సిన అర్హతలున్న వారిని గుర్తించాలని, అందుకు అనుగుణంగా ఆ రెండు కేటగిరీలకు ఎన్ని పోస్టులు కావాలో నిర్ణయించాలని సూచించింది. ఆ తర్వాతే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే గురుకులాలు ఆయా కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ప్రకటించలేదని తెలుస్తోంది. దీంతో టీఎస్పీఎస్సీ మెరిట్ లిస్టు ప్రకటించలేదు. హైకోర్టు తీర్పు ఇచ్చి నెలరోజులు గడిచినా కొత్త మెరిట్ లిస్టు రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు అభ్యర్థులు చనిపోయారని చెబుతున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. పాత పద్ధతిలోనే పోస్టులను భర్తీ చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
