
న్యూఢిల్లీ: ఇండియా రిటైల్ రంగం 2030 నాటికి 10 శాతం సీఏజీఆర్‌తో దాదాపు రెండింతలు... అంటే 1.93 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ.1,67,92,000 కోట్లు) చేరుకుంటుందని అంచనా. డెలాయిట్- ఫిక్కీ రిపోర్ట్ ప్రకారం, 2024లో భారతదేశ రిటైల్ రంగం విలువ 1.06 ట్రిలియన్ డాలర్లు. యువత కొనుగోలు శక్తి పెరగడం వలన దేశీయ డిమాండ్ పెరగడంతోపాటు బ్రాండ్లకు అంతర్జాతీయంగా ఎదిగే అవకాశాలు వస్తున్నాయి.
భారతదేశ రిటైల్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు, డిజిటల్ ఫస్ట్, క్విక్ కామర్స్, డైరెక్ట్ టు కన్స్యూమర్ (డీ2సీ) బ్రాండ్లు వేగంగా ఎదుగుతున్నాయి. యువ, డిజిటల్ జనాభా, మధ్యతరగతి పెరుగుదల, చిన్న నగరాల నుంచి డిమాండ్తో ఈరంగం దూసుకెళ్తోంది. ఈ నగరాల నుంచే 60 శాతం ఈ–-కామర్స్ లావాదేవీలు జరుగుతున్నాయి.
'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులపై జనానికి నమ్మకం పెరిగింది. ఆహారం, డ్రింక్స్ విషయంలో 68 శాతం, గృహ అలంకరణ వస్తువుల్లో 55 శాతం, పర్సనల్ కేర్లో 53 శాతం మంది స్థానిక బ్రాండ్లనే ఇష్టపడుతున్నారు. క్విక్ కామర్స్ కంపెనీలు వేగంగా ఎదుగుతున్నాయి. 80కి పైగా నగరాల్లో ఈ సేవలు లభ్యమవుతుండగా, ఇది 70-80 శాతం సీఏజీఆర్‌తో వృద్ధి చెందుతోంది. బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఇవి గత ఏడాది రిటైల్ స్థలంలో 60 శాతం ఆక్రమించాయని ఈ రిపోర్ట్ తెలిపింది.