సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి.. ఎంపీ వంశీకృష్ణకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వినతి

సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలి.. ఎంపీ వంశీకృష్ణకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వినతి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్​ పెంపు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బాధ్యులు వినతిపత్రం అందజేశారు. గురువారం హైదరాబాద్​లోని విశాక టవర్స్​లో ఎంపీని అసోసియేషన్ ​ప్రెసిడెంట్ ​దండం రాజు రాంచందర్ ​రావు ఇతరులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెన్షన్​ స్కీం అమలైనప్పటి నుంచి ఇప్పటివరకు రివైజ్ చేయకపోవడంతో పెన్షన్ పెరగలేదన్నారు.

అరకొర పెన్షన్​తో రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెన్షన్​ను పెంచేందుకు కృషి చేయాలని ఎంపీని కోరారు. ఉద్యోగుల కుటుంబాలకు మెరుగైన వైద్యం, రేషన్​ కార్డుల జారీకి చొరవ చూపాలని విన్నవించారు. స్పందించిన ఎంపీ వంశీకృష్ణ ఈనెల 21 నుంచి జరిగే వర్షాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.