మేడిగడ్డ కేసీఆర్ ప్లానే.. మా రిపోర్ట్ ను పట్టించుకోలేదు

మేడిగడ్డ  కేసీఆర్ ప్లానే..  మా రిపోర్ట్ ను పట్టించుకోలేదు

తుమ్మడి హెట్టి వద్ద ప్రపోజ్ చేస్తే పక్కన పడేశారు
 పీసీ ఘోష్​ కమిషన్ కు రిటైర్డ్ ఇంజినీర్ల నివేదిక
 కాళేశ్వరంపై విచారణ వేగవంతం చేసిన కమిషన్
 పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనన్న ఘోష్​
 లేదంటే ఏం చేయాలో తనకు తెలుసునని వ్యాఖ్య

హైదరాబాద్: మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్నది కేసీఆర్ ప్లానేనని రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ ఇవాళ కాళేశ్వరం కమిటీకి రిపోర్ట్ ఇచ్చింది. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. తుమ్మిడిహెట్టి వద్ద తాము ప్రపోజ్ చేసినా వద్దని పక్కన పడేశారని తెలిపింది. రిపోర్ట్‌ను అప్పటి ఇరిగేషన్ మినిస్టర్, సీఎం కేసీఆర్‌కు అందించినా సంతకం చేయలేదని ఇంజినీర్లు తెలిపారు. ఈ మేరకు అప్పుడు ప్రపోజ్ చేసిన నివేదికను రిటైర్డ్ ఇంజినీర్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిటీకి అందజేశారు. అనంతరం పీసీ ఘోష్ మీడియాతో చిట్ చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం సబ్ కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. ఆ సంస్థలకు సంబంధించిన డేటాను రిజిస్ట్రార్ ఆఫ్​ కంపెనీస్ నుంచి తీసుకుంటామని చెప్పారు. ఆయా కంపెనీల ఖాతాలు, బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలిస్తే ఎంత మొత్తం చేతులు మారిందనేది తెలుస్తుందని చెప్పారు. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను పిలువాలా..? వద్దా..? అనే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు.

పిలిస్తే రావాల్సిందే!

విచారణకు పిలిస్తే ఎవరైనా రావాల్సిందేనని పీసీ ఘోష్ అన్నారు. రాకుంటే ఏం చేయాలో తమకు తెలుసునని  చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారాలున్నాయని అన్నారు. అన్ని అఫిడవిట్లను పరిశీలించిన తర్వాతే సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్లను పిలుస్తామని చెప్పారు.  ఏఈఈ, డీఈఈలను విచారించాలా..? వద్దా..? అన్నది తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఇంజినీర్లతో విచారణ పూర్తయిందన్నారు. వాళ్ల నుంచి అఫిడవిట్లు వచ్చాక ముందుకు వెళ్తామని అన్నారు. మొత్తం 10 నుంచి 15 సబ్ కాంట్రాక్ట్‌లు ఇచ్చారు. వాటి వివరాలను సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైంది.