పెద్దాఫీసర్లు కాదు.. ప్రభుత్వమే ఫెయిలైంది

పెద్దాఫీసర్లు కాదు.. ప్రభుత్వమే ఫెయిలైంది

గాంధీ, టిమ్స్ బయటా, లోపలా చాలా మంది కరోనా పేషెంట్లు, వారి బంధువులతో మాట్లాడితే చాలా సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి సమస్యలను ప్రభుత్వంలోని మెడికల్ పర్సన్సే పరిష్కరించాలి. వేరేవాళ్లకి ఎలాంటి కమిట్మెంట్ ఉండదు. కానీ, మెడికల్ ఆఫీసర్లు, ఐఏఎస్​లు ఓపెన్​గా ఉండలేరు. భయంభయంగా గడుపుతుంటారు. ప్రోయాక్టివ్​గా ఉండటంతో సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో వీరంతా ఫెయిల్ అయ్యారు. వాస్తవానికి ఇది బ్యూరోక్రసీ ఫెయిల్యూర్ కాదు. కరోనా నియంత్రణలో ఐఏఎస్‌‌ ఆఫీసర్లు కాదు. రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా ఫెయిలైంది. సీఎం కేసీఆర్‌‌ ఏం చేయమంటే ఆఫీసర్లు అదే చేస్తారు. సెక్రటేరియెట్‌‌, అసెంబ్లీ బ్రహ్మాండంగా కట్టి చరిత్రలో చిరస్థాయిగా పేరు నిలుపుకోవాలనుకుంటున్న పాలకులు అసలు ప్రజలకు ఏది అవసరం? ఏది ప్రాధాన్యం అని ఆలోచించట్లేదు. ఇది దుర్మార్గపు యాటిట్యూడ్‌‌. నేను ఇంజనీరింగ్‌‌ చేశాను. సెక్రటేరియెట్‌‌ కూల్చివేతపై కూడా ఎనాలసిస్‌‌ చేశా. ఈ బిల్డింగ్స్‌‌ కనీసం వందేండ్లపాటు నడిచేవి. కళ్ల ముందే, చూస్తుండగానే కూలగొట్టారు. అసెంబ్లీ కూడా ఇంకో వెయ్యి ఏండ్లు నడుస్తుంది.

ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్ ఉండాలె
నేను చాలా యూరోపియన్‌‌ దేశాలను తిరిగొచ్చా. స్విట్జర్లాండ్‌‌లోని దావోస్‌‌లో 13 వేల జనాభా ఉంటే, వారి కోసం అక్కడ యశోదా లాంటి పెద్ద హాస్పిటల్‌‌ కట్టారు. 2 లక్షల జనాభా కోసం 500 బెడ్స్‌‌ హాస్పిటల్‌‌ ఉంది. అక్కడ డాక్టర్లతోపాటు అన్ని రకాల ఫెసిలిటీస్‌‌ ఉంటాయి. మన దేశంలో కూడా అలాగే ఉండాలి. మన ప్రతి గ్రామ పంచాయతీకి హెల్త్‌‌ సెంటర్‌‌ ఉండాలి. అందులో 15 రకాల టెస్టులు చేసే వెసులుబాటు కల్పించాలి. టెస్టుల కోసం దూర ప్రాంతాలకువెళ్లాల్సిన అవసరం ఉండొద్దు. కనీసం మూడు గ్రామ పంచాయతీలకు ఒక హెల్త్ సెంటర్ కట్టినా రూ.220 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది పెద్ద విషయం కాదు. మన దగ్గర ఒక మండలంలో ఉండే జనాభాకు యూరప్‌‌లో యశోదా లాంటి హాస్పిటల్‌‌ ఉన్నప్పుడు.. తెలంగాణలో ఒక్కో మండలంలో కనీసం 30 బెడ్స్‌‌ హాస్పిటల్ ఎందుకు ఉండొద్దు. ప్రతి నియోజకవర్గానికి 500 బెడ్స్‌‌ హాస్పిటల్‌‌ ఎందుకు కట్టరు? కనీసం ఉన్న హాస్పిటళ్లనూ పట్టించుకోవడం లేదు. వాటి మానానికి వాటిని వదిలేస్తున్నారు. ప్రభుత్వం వద్ద డబ్బు ఉన్నా ఖర్చు పెట్టడంలేదు. ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్లలో 1,000 పడకల హాస్పిటల్‌‌ ఉండాలి. నేను చిట్యాలలో రాత్రి నిద్ర చేసినప్పుడు 40 రకాల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. బడ్జెట్‌‌ లేకపోవడంతో వీటిని చేయలేకపోతున్నామని కిందిస్థాయి అధికారులు చెప్పారు. ఏడాదికి 3 కోట్లతో వీటిని పరిష్కరించే చాన్స్‌‌ ఉంది. యూరోప్లో 95 శాతం ప్రభుత్వ హాస్పిటల్స్‌‌ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఆ విధంగా ఆలోచించడంలేదు.

కాళేశ్వరం కోసం లక్ష కోట్లు బూడిదలో పోశారు
నేను కలెక్టర్‌‌గా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ను క్లోజ్‌‌గా చూశా. కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయలు ఉత్త పుణ్యానికి బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. 42 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చని చెబుతున్నారు. కానీ, 12 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీరు ఇవ్వడం కుదరదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ రాంగ్‌‌ డిజైన్‌‌. ఒక ఎకరానికి ఎలక్ట్రిసిటీకే రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ ఖర్చు పెట్టాల్సివస్తుంది. ధనిక రైతులకూ రైతుబంధు డబ్బులు ఇచ్చారు. ఇదేం అడ్మినిస్ట్రేషన్‌‌, ఎవరి సొమ్మని ఇస్తారు. దీంతో రాష్ట్రంలోని పేదలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఏటా 50 వేల కోట్లు హుష్‌‌కాకి..
ఒకప్పుడు ఎమ్మెల్యేలు లంచాలు తీసుకునేవారు కాదు. ఉమ్మడి ఏపీలో అనంతపురంలో మాజీ మంత్రి పరిటాల రవి 5 శాతం కమీషన్‌‌ తీసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత అది 10 శాతానికి పెరిగిపోయింది. 10 శాతం ఎమ్మెల్యే, 10 శాతం కార్పొరేటర్‌‌, 10 శాతం డిపార్ట్​మెంట్ ఇంజినీర్లు, 10 శాతం ఓవర్‌‌హెడ్‌‌ చార్జీలు ఇలా 50 శాతం వరకు కమీషన్‌‌ కిందే పోతున్నాయి. ఏటా రూ.లక్ష కోట్ల పనులు చేస్తున్నారు. ఇందులో తక్కువలో తక్కువ 50 వేల కోట్ల రూపాయలు బయటకు వెళ్లిపోతున్నాయి. ఈ 50 వేల కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు కట్టొచ్చు. ఇలాంటి వాటిలో మనం ఎంతో నష్టపోతున్నాం.

రాజకీయం కోసమే గాంధీ, ఎంజీఎం టూర్
ప్రస్తుత కరోనా టైంలో ప్రభుత్వ ఆస్పత్రులే అసలైన సొల్యూషన్‌‌.. ప్రైవేట్‌‌ హాస్పిటల్స్‌‌ కాదు. ప్రతిపక్ష నాయకులు పర్యటిస్తున్నారని, చెడ్డ పేరు వస్తుందని సీఎం కేసీఆర్‌‌.. గాంధీ, ఎంజీఎం హాస్పిటళ్లకు వెళ్లారు. ఎలాంటి కమిట్‌‌మెంట్‌‌తోనూ వెళ్లలేదు. గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్‌‌లో ఇంకా ఐదేండ్లు అయినా ఎలాంటి మార్పు రాదు. కాళేశ్వరం, సెక్రటేరియెట్‌‌ పనులను ఇంట్లో కూర్చొని కూడా ప్రతి రోజు రివ్యూ చేస్తారు. కానీ, హాస్పిటళ్లను మాత్రం పట్టించుకోరు. ఆత్మనిర్భర భారత్‌‌ స్కీమ్​ను​ 20 లక్షల కోట్లతో పెట్టారు. లక్ష కోట్లతో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్‌‌ వేయొచ్చు. ఇతర దేశాలకు ఎవరు ఎగుమతి చేయమన్నారు. ఇప్పుడు మనకు వ్యాక్సిన్‌‌ లేకుండా పోయింది.

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వార్‌‌ రూం..
ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైతే వార్‌‌ రూం పెట్టాలి. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు పైకి వస్తుంటే వార్‌‌ రూం పెట్టారు. ఆయన ఎప్పుడూ అక్కడే ఉన్నారు. వార్‌‌ రూం ఉంటే.. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ వెంటిలేటర్లు అవసరం? ఎక్కడ ఆక్సిజన్‌‌ కావాలి? అనే విషయాలు తెలుస్తాయి. వార్‌‌ రూంలో సీఎం, హెల్త్‌‌ మినిస్టర్‌‌ కనీసం నాలుగు గంటలు ఉండాలి. 10 మంది ఐఏఎస్‌‌ ఆఫీసర్లు కూర్చోవాలి. ప్రతి ఉమ్మడి జిల్లాకు 10 మంది సీనియర్‌‌ ఆఫీసర్లను ఇన్‌‌చార్జ్​గా పెట్టాలి. ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. కానీ ఇవేవీ ప్రస్తుతం జరగడంలేదు. కేసీఆర్‌‌ ఇప్పుడు మెడికల్‌‌ హెచ్‌‌వోడీని ప్రగతి భవన్‌‌కు పిలిపించుకుని, అన్ని బాగానే ఉన్నాయి కదా అని అడిగి వదిలేస్తారు. జనాలు చచ్చినా ఏం కాదని అనుకుంటారేమో.. చస్తే బడ్జెట్‌‌, పింఛన్‌‌ డబ్బులు మిగులుతాయని అనుకుంటారేమో అనిపిస్తుంటుంది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్లో 6 ఆక్సిజన్‌‌ ప్లాంట్లు శాంక్షన్‌‌ చేసింది. సరిగా పనిచేస్తే 15 రోజుల్లో కంప్లీట్‌‌ చేయాలి. ఈ మధ్యనే గాంధీలో మాత్రం ఒకటి పెట్టారు. మిగితా వాటిని పట్టించుకోవడం లేదు. ప్రతి విషయాన్నీ బిజినెస్‌‌ యాంగిల్‌‌లోనే చూస్తున్నారు. గాంధీలో వెంటిలేటర్లు పక్కదారి పడుతున్నట్లు తెలిసింది. దీనితోపాటు రెమ్డిసివిర్ ఇంజెక్షన్లను కూడా బయటకు అమ్ముతున్నారు. వీటిని ఎవరూ మానిటర్‌‌ చేయరు. 

డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలనే సోయి లేదు
కూలగొట్టిన చోటే సెక్రటేరియెట్‌‌ నిర్మాణ పనులు అప్పుడే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఉస్మానియా ఆస్పత్రి, చెస్ట్‌‌ హాస్పిటల్‌‌, గాంధీ హాస్పిటల్, ఫీవర్‌‌ హాస్పిటల్‌‌, ఎంజీఎం హాస్పిటల్స్ కోసం కొత్త భవనాలు నిర్మించాలని, పాత వాటిని రెనోవేషన్‌‌ చేయాలని ఎప్పుడో ప్రభుత్వాన్ని కోరాం. ఇప్పటి వరకూ వాటిని మాత్రం అసలు పట్టించుకోలేదు. ఏడున్నర ఏండ్ల తర్వాత గాంధీ, ఎంజీఎం హాస్పిటల్స్‌‌కు కేసీఆర్‌‌ ఇప్పుడు వెళ్లారు. సెక్రటేరియెట్‌‌, అసెంబ్లీ మాత్రమే కాదు.. ప్రగతి భవన్‌‌ కూడా అంతలా కట్టాల్సిన అవసరం ఉందా? రాష్ట్రంలో సరిగా స్కూళ్లు కూడా లేవు. సర్కారీ స్కూళ్లకు, కాలేజీలకు బిల్డింగ్‌‌లు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌‌, ప్రైమరీ హెల్త్‌‌ సెంటర్లు లేవు. ఇవేవీ కట్టకుండా వందల, వేల కోట్ల రూపాయలను నాశనం చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ ధనిక రాష్ట్రం. కానీ, ఆ డబ్బులను ఎలా ఖర్చు పెట్టాలనే సోయి లేదు. ఇలాంటి విషయాలపై ప్రజలను చైతన్యవంతులను చేయాలి.

- ఆకునూరి మురళి, రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ ఆఫీసర్‌‌, ఆంధ్రప్రదేశ్‌‌ విద్యాశాఖ సలహాదారు