రిటైర్డ్​ పోలీస్​ ఆఫీసర్​ను కాల్చి చంపిన టెర్రరిస్టులు

 రిటైర్డ్​ పోలీస్​ ఆఫీసర్​ను  కాల్చి చంపిన టెర్రరిస్టులు

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని బారాముల్లా జిల్లాలో దారుణం జరిగింది. టెర్రరిస్టులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఓ మసీద్‌‌లో ప్రార్థన చేసుకుంటున్న రిటైర్డ్​ పోలీస్‌‌ ఆఫీసర్​ను కాల్చి చంపారు. మహ్మద్‌‌ షఫీ మీర్‌‌ రిటైర్డ్​ పోలీస్ ​సూపరింటెండెంట్. ఆయన ఆదివారం ఉదయం స్థానిక మసీదులో ప్రార్థన చేస్తుండగా.. అక్కడికి చేరుకున్న కొందరు టెర్రరిస్టులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో మహ్మద్‌‌ షఫీ అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

 కాగా, పూంఛ్‌‌ జిల్లాలో జవాన్లను తరలిస్తున్న సైనిక వాహనాలపై పక్కా ప్రణాళికతో టెర్రరిస్టులు కాల్పులు జరిపిన రెండు రోజుల్లోనే.. రిటైర్డ్​ పోలీస్​ ఆఫీసర్ ను చంపడం ఆందోళన కలిగిస్తున్నది. రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఖండించాయి. హింసను ఏ రూపంలోనూ సహించలేమని నేషనల్‌‌ కాన్ఫరెన్స్‌‌ పేర్కొంది. పీడీపీ చీఫ్​ మెహబూబా ముఫ్తీ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. ‘ఐదుగురు జవాన్లు మిలిటెంట్ల ఆకస్మిక దాడిలో వీరమరణం పొందారు. 

ముగ్గురు అమాయక పౌరులు సైన్యం కస్టడీలో మరణించారు. ఇప్పుడు ఒక రిటైర్డ్ ఆఫీసర్ ​చనిపోయారు. ప్రభుత్వం చెప్పిన సాధారణ స్థితిని కొనసాగించడంలో అమాయకులు నష్టపోయారు” అని పేర్కొన్నారు. బీజేపీ ఈ చర్యను భయంకరమైనదిగా అభివర్ణించింది. ‘‘ ఆజాన్​ను కూడా సహించని టెర్రరిస్టులు రిటైర్డ్ పోలీసు అధికారిని చంపారు. టెర్రరిజంకు, టెర్రరిస్టులకు మతం లేదు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ తెలిపారు.