
బషీర్ బాగ్, వెలుగు : పాలకులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు రచయితలు పనిచేయాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సుదర్శన్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో రచయితలు, కళాకారులు కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. రచయితలకి స్వీయ నియంత్రణ అవసరమన్నారు. రచయితలు, సీనియర్లకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రచయితల వేదిక వంటి సంస్థలు స్పందించి సాహిత్య కళారంగాలకు మార్గనిర్దేశం చేయాలన్నారు. అనంతరం ప్రముఖ కవి అందెశ్రీ మాట్లాడుతూ తన గీతానికి అధికారిక హోదా కల్పించినప్పటికీ, తెలంగాణ ప్రజలు తన పుస్తకాలను భుజాల మీద వేసుకొని పంచిన కీర్తి కన్నా గొప్పది కాదన్నారు. తెలంగాణ రచయితల వేదిక అధ్యకుడు కొండి మల్లారెడ్డి అధ్యక్షత జరిగిన మీటింగ్ లో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, జూకంటి జగన్నాథం, సంగెవేణి రవీంద్ర, జి.నాగభూషణం, అనిశెట్టి రజిత, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, జూపాక సుభద్ర, భూర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.