
ప్రధాని నరేంద్ర మోడీకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం మూడు లెటర్లు రాశారు. సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంచాలని, హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయసును మూడేళ్లు పెంచాలని, పెండింగ్ కేసుల క్లియరెన్స్ కు రిటైర్డ్ జడ్జీల సర్వీసుల్ని వినియోగించుకోవాలని ఆ లెటర్లలో కోరారు. సుప్రీంకోర్టులో 58,669 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, కొత్తగా కేసులు నమోదవుతున్నందున ఆ సంఖ్య పెరుగుతోందన్నారు . సుప్రీంకోర్టులో 26 కేసులు 25 ఏళ్లుగా, వంద కేసులు 20 ఏళ్లుగా, 593 కేసులు 15 ఏళ్లుగా, 4,977 కేసులు పదేళ్లుగా పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. జడ్జీలు లేక ముఖ్యమైన కేసుల పరిష్కారానికి కానిస్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు కూడా ఇబ్బందవుతోందన్నారు. 1988లో సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 18 నుంచి 26కు, 2009లో 31కి పెంచినట్లు గుర్తు చేశారు. సకాలంలో న్యాయం అందించేందుకు సుప్రీంకోర్టు సమర్థవంతంగా పని చేయాలంటే జడ్జీల సంఖ్యను పెంచాలని, దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్, జడ్జీల సంఖ్యను పెంచారని, సుప్రీంకోర్టులో మాత్రం పెంచలేదన్నారు. రెండో లెటర్ లో హైకోర్టు జడ్జీల రిటైర్మెంట్ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని ప్రధాని మోడీని సీజేఐ కోరారు. జడ్జీల కొరత వల్ల 24 హైకోర్టుల్లో 43 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. హైకోర్టుల్లో ప్రస్తుతం 399 పోస్టులు (37 శాతం) ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులు చేసినట్లు చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి రిటైర్డ్ జడ్జీల సేవలు వినియోగించాలని, రాజ్యాంగంలోని 128, 224 ఏ ఆర్టికల్స్ కింద ఇది సాధ్యమని మూడో లెటర్ లో చీఫ్ జస్టిస్ వివరించారు.