ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంపు

 ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంపు

ప్రభుత్వ మెడికల్‌‌, డెంటల్‌‌కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసును 58 నుంచి 65 ఏండ్లకు పెంచడానికి గవర్నర్‌‌‌‌ నరసింహన్‌‌ శనివారం ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్‌‌ ఎంప్లాయిమెంట్‌‌ యాక్ట్‌‌కు సవరణలు చేస్తూ.. పెంపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఆర్డినెన్స్‌‌ జారీ చేశారు. ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయకపోవడం, సకాలంలో డాక్టర్లకు పదోన్నతులు ఇవ్వకపోవడంతో బోధనాస్పత్రుల్లో ఖాళీల సంఖ్య పెరుగుతోందని ఆర్డినెన్స్‌‌లో పేర్కొన్నారు. ఈ ఖాళీల కారణంగా వైద్య విద్య నాణ్యత తగ్గడంతోపాటు బోధనాస్పత్రులకు వచ్చే రోగులపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఖాళీల కారణంగా పీజీ, యూజీ సీట్లు కోల్పోయే ప్రమాదమున్న నేపథ్యంలోనే ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

సమ్మె విరమించిన జూడాలు…

ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంపును నిరసిస్తూ జూడాలు శనివారం చలో గాంధీకి పిలుపునిచ్చారు. దీంతో వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ వారితో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఏజ్ హైక్‌‌తో తాము ఉద్యోగావకాశాలు కోల్పోతామని, ఇప్పటికే పదేండ్లుగా ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ జేయడం లేదని వివరించారు. ఖాళీగా ఉన్న 1,300 అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌‌‌ పోస్టులను భర్తీ జేయాలని కోరారు. ఈ డిమాండ్లకు మంత్రి అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడా అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌‌ డాక్టర్‌‌‌‌ విజయేందర్‌‌‌‌ ప్రకటించారు. కాగా, ప్రొఫెసర్ల రిటైర్మెంట్​ వయసు పెంచినట్టుగానే, నాన్‌‌ టీచింగ్‌‌ డాక్టర్ల రిటైర్మెంట్​ వయసును కూడా పెంచాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(డీహెచ్‌‌ విభాగం) ప్రతినిధులు మంత్రి ఈటలకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు.