పహల్గాం టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ సాజిద్ జాట్: NIA చార్జిషీట్‎లో సంచలన విషయాలు

పహల్గాం టెర్రర్ ఎటాక్ మాస్టర్ మైండ్ సాజిద్ జాట్: NIA చార్జిషీట్‎లో సంచలన విషయాలు

న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సంచలన విషయాలు వెల్లడించింది. సోమవారం (డిసెంబర్ 15) జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 1,597 పేజీలతో కూడిన ఛార్జ్‎షీట్‎ను ఎన్ఐఏ దాఖలు చేసింది. లష్కరే తోయిబా (LeT) ఉగ్ర సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సాజిద్ జాట్‌ను పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక కుట్రదారుడిగా పేర్కొంది. 

ఈ కేసులో లష్కరే తోయిబాతో పాటు దాని ప్రధాన అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) ఉగ్రవాద సంస్థతో సహా ఏడుగురు  నిందితులపై ఎన్ఐఏ అభియోగాలు మోపింది. 2025 జూలైలో శ్రీనగర్‌లోని డాచిగామ్‌లో జరిగిన ఆపరేషన్ మహాదేవ్‌లో భారత భద్రతా దళాలు హతమార్చిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పేర్కొంది. ఈ ముగ్గురిని ఫైసల్ జాట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హంజా ఆఫ్ఘనిగా గుర్తించారు. 

అలాగే.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు 2025, జూన్ 22న ఎన్ఐఏ అరెస్టు చేసిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జోతాడ్ అనే ఇద్దరు నిందితుల పేర్లను కూడా చార్జిషీట్‎లో చేర్చింది. పహల్గాం ఉగ్రదాడిని అత్యంత సీరియస్‎గా తీసుకున్న ఎన్ఏఐ దాదాపు ఎనిమిది నెలల పాటు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్‎లో పాకిస్తాన్ కుట్ర, పహల్గామ్ దాడికి ప్లాన్, వ్యూహాన్ని అమలు చేయడంలో నిషేధిత ఎల్‌ఇటి/టీఆర్‌ఎఫ్ పాత్రను ఎన్ఐఏ వివరించింది. ఈ మేరకు నిందితులపై బీఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 

2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు కురిపించిన తుటాల వర్షానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. మతం ఆధారంగా ఒకే వర్గాన్ని టార్గెట్ చేసుకుని నరమేధానికి పాల్పడ్డారు. యావత్ దేశాన్ని ఉలిక్కి పాటుకు గురి చేసిన ఈ ఉగ్ర దాడి కేసు విచారణను కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించింది.