ఉద్యోగుల రిటైర్​మెంట్లు షురూ.. ఈ ఏడాది 7,995 మంది పదవీ విరమణ

ఉద్యోగుల రిటైర్​మెంట్లు షురూ.. ఈ ఏడాది 7,995 మంది పదవీ విరమణ

హైదరాబాద్, వెలుగు: ఏజ్​ పెంపుతో మూడేండ్లుగా వాయిదా పడిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్లు షురూ అయ్యాయి. మార్చ్ 31న ఆదివారం నాటికి రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు 400 మంది ఉద్యోగులకు 61 ఏండ్లు నిండాయి. శనివారం వర్కింగ్ డే కావడంతో వీరంతా ఆ రోజే పదవీవిరమణ తీసుకున్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల రిటైర్​మెంట్ ఏజ్ 58 ఏండ్లు ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో దానిని 61 ఏండ్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూడేండ్లలో రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య 1,700 దాటలేదు. కాగా ఈ ఏడాది గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు మొత్తం 7,995 మంది రిటైర్ కానున్నారు.

ఏపీలో ఉన్న వారిని వెనక్కి తీసుకురండి

తెలంగాణ స్థానికత కలిగి ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగులు 702 మంది ఉన్నారు. వీరిని రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిష్కరించలేదు. వారంతా ప్రతి వారం హైదరాబాద్, ఏపీ మధ్య తిరుగుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ జర్నీతో చాలా మంది అనారోగ్యాల పాలయ్యారు. కొంత మంది చనిపోయారు కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. సమస్య పరిష్కరిస్తామని మంత్రలు హామీ ఇచ్చినట్టు వారు చెబుతున్నారు. రిటైర్ మెంట్ల నేపథ్యంలో శాఖల్లో ఏర్పడే ఖాళీల్లో అడ్జస్ట్ చేయాలని వారు కోరుతున్నారు.

కొత్త జిల్లాల్లో ఖరారు కాని క్యాడర్ స్ట్రెంత్

పరిపాలనా సౌలభ్యం పేరుతో రాష్ట్రంలో 2016లో 31 జిల్లాలు ఏర్పడ్డాయి. తరువాత ములుగు, నారాయణ పేట జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ ఏ జిల్లాకు ఎంత మంది ఉద్యోగులు, ఎన్ని పోస్టులు ఉండాలన్న అంశమైన క్యాడర్ స్ట్రెంత్ ఖరారు కాలేదని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. దీనిపై అప్పటి సీఎం, మంత్రులను ఎన్నిసార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. కానీ జీవో 317ను తీసుకొచ్చి ఆగమేఘాల మీద అమలు చేశారని చెబుతున్నారు. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగులు స్థానికత కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 317 జీవోను సవరించేందుకు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసి, వినతిపత్రాలు తీసుకుందంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు.

రిటైర్ అయిన వాళ్లను కొనసాగించొద్దు

రిటైర్ అయిన వారిని కన్సల్టెంట్లుగా నియమించి తీసుకోవద్దని ఉద్యోగులు కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1,050 మంది రిటైర్డ్​అధికారులను తీసుకోవటం వల్ల చాలా మంది ప్రమోషన్లు పొందకుండానే రిటైర్ అయ్యారని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏటా సగటున 8వేల మందికి పైగా రిటైర్ అవుతారని చెప్తున్నారు. ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి టీఎస్ పీఎస్సీ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతున్నారు.

కేసీఆర్ మా సమస్య పరిష్కరించలే

తెలంగాణ స్థానికత కలిగి పదేండ్లుగా 712 మందిమి ఏపీలో పనిచేస్తున్నం. గత సీఎం కేసీఆర్ కు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలే. 2021 లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉద్యోగుల బదలాయింపుకు సర్క్యూలర్లు ఇచ్చాయి. ఏపీలో ఫైల్ క్లియర్ చేసి ఏడాదిన్నర అవుతుంది. ఇక్కడ మాత్రం ఫైల్ పెండింగ్ లో ఉంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మా సమస్యను వివరించాం.. ఆయన పాజిటివ్ గా స్పందించారు. కోడ్ ముగిసిన తరువాత పరిష్కారిస్తారనే నమ్మకం ఉంది.
‑ లక్ష్మీనారాయణ, అంజయ్య   ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ( టీన్యూసా, తెలంగాణ నేటివ్ ఎంప్లాయిస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర )