
ముంబై: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) హ్యాక్ కాదని, ఓటీపీతో కూడా దీనిని కంట్రోల్ చేయలేమని రిటర్నింగ్ అధికారిణి వందనా సూర్యవంశీ స్పష్టం చేశారు. ఇదొక ఫూల్ ఫ్రూఫ్ టెక్నికల్ పరికరమని, కమ్యూనికేషన్ కోసం ఇందులో ఎలాంటి సదుపాయంలేదని వెల్లడించారు. ముంబైలో ఈవీఎంను హ్యాక్ చేశారని వచ్చిన ఆరోపణలపై ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈవీఎం వైర్‌లెస్ లేదా వైర్ కమ్యూనికేషన్ పరికరం కాదని చెప్పారు. దీనిని అన్‌లాక్ చేయడానికి మొబైల్ ఫోన్, ఓటీపీ అవసరం లేదని వివరించారు.
ఏం జరిగిందంటే..
ముంబై నార్త్ వెస్ట్ లోక్సభ స్థానంలో శివసేన(షిండే) నేత రవీంద్ర మైకర్ 48 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే, ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి మైకర్ బంధువు మొబైల్ ఫోన్ తీసుకెళ్లి ఈవీఎంను హ్యాక్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనిపై తాజాగా రిటర్నింగ్ ఆఫీసర్ వివరణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకొచ్చిన వ్యక్తిపై పోలీస్ కేసు నమోదు చేశామని చెప్పారు.