సీఎల్పీ విలీనంపై ప్రశ్నించే గొంతులెక్కడ.?

సీఎల్పీ విలీనంపై ప్రశ్నించే గొంతులెక్కడ.?

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనంపై కాంగ్రెస్ నేతలు గురువారం అసెంబ్లీ ఎదుట చేపట్టిన దీక్షకు కాంగ్రెస్‌ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూరంగా ఉండడంపై పార్టీలో వాడివేడి చర్చ నడుస్తోంది. అసెంబ్లీ వద్ద అంత గొడవ జరుగుతున్నా అందుబాటులో ఉండి కూడా వారు రాకపోవడంపై నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి అన్యాయం జరుగుతున్న టైంలో మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రశ్నించే గొంతులని వీరికి పేరుంది. ప్రతిపక్షం ఉండాలన్న ఉద్దేశంతోనే మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో జనం వీరిని గెల్పించారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలోకి తొక్కి సీఎల్పీని అన్యాయంగా టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకున్నారు. దాన్ని నిరసిస్తూ అసెంబ్లీ వద్ద చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమానికి కూడా రాకపోతే ఎలా? అదీ అందుబాటులో ఉండి కూడా రాకపోవడం ఏంటి’’ అని కాంగ్రెస్‌ నేత ఒకరు ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో ఇతర ముఖ్య నేతలు కూడా అసెంబ్లీకి రాలేదు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మరికొందరు మాత్రమే నల్ల బ్యాడ్జీలతో  మౌన దీక్షకు దిగారు. రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అందుబాటులోనే ఉండి కూడా గైర్హాజరయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య,  ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కూడా రాలేదు. దీంతో పార్టీ నేతల మధ్య అనైక్యత, సమన్వయ లోపం మరోసారి బయటపడిందని విశ్లేషకులు అంటున్నారు.

ఎక్కడున్నారు?

అసెంబ్లీ వద్ద కాంగ్రెస్‌ నేతలు నిరసన తెలుపుతున్న టైంలో రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి సెగ్మెంట్‌లోనే ఉన్నారు. హైదరాబాద్ సిటీని ఆనుకొని ఉన్న ఈ సెగ్మెంట్‌ నుంచి అసెంబ్లీకి చేరుకునేందుకు ఎంత ట్రాఫిక్  జామ్ ఉన్నా గంటలోపే సమయం పడుతుంది. అయినా ఆయన రాలేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ స్థానికంగానే ఉన్నా గైర్హజరయ్యారు. సీఎల్పీ విలీనం కన్నా వాళ్లకు పార్టీ పరంగా ముఖ్యమైన పనులు ఇంకేం ఉంటాయని నేతలు ప్రశ్నిస్తున్నారు.