
- మా ప్రభుత్వం తెస్తుంటే.. ఆమె రంగులు పూసుకోవడం దేనికి?
- బీసీలను వంచించిందే బీఆర్ఎస్ అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను పెంచుతుంటే, ఆమె అది తన గొప్పతనంగా చెప్పుకుంటూ సంబురాలు చేసుకోవడమేమిటని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు అనేది రాహుల్ గాంధీ అజెండా, సీఎం రేవంత్ రెడ్డి కమిట్‌మెంట్ అని పేర్కొన్నారు.
శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మహేశ్ గౌడ్ మాట్లాడారు. ‘కవిత కోన్‌కిస్కా.. కవిత లేదు..భవిత లేదు..’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు. ‘‘రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. కానీ అది తన గొప్పతనంగా చెప్పుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రంగులు పూసుకోవడం ఏంటి? చోటామోటా ధర్నాలు చేసి, తన వల్లే బీసీ రిజర్వేషన్లు పెంచుతున్నారని ఆమె సంబురాలు చేసుకోవడం ఏంటి?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కవిత తీరును చూసి జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. ‘‘కవిత.. బీసీలను వంచించిన కేసీఆర్ కూతురు నువ్వు. ఆ విషయం మరిచిపోవద్దు. మీ హయాంలో బీసీ రిజర్వేషన్లను తగ్గించారు. దీనిపై ఆత్మపరిశీలన చేసుకోండి” అని సూచించారు.